టీమిండియా ఘోర పరాజయం

TEAM INDIA LOST THE MATCH

  • కివీస్ తో నాలుగో వన్డేలో 92 పరుగులకే ఆలౌట్
  • 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
  • 45 ఓవర్లలోనే మ్యాచ్ పూర్తి

టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత క్రికెట్ జట్టు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. న్యూజిలాండ్ తో హామిల్టన్ లో గురువారం జరిగిన నాలుగో వన్డేలో మన క్రికెటర్లు ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేశారు. టాస్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్‌ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండు ఇన్నింగ్స్ లూ కలిపి 45 ఓవర్లు కూడా లేకపోవడం గమనార్హం. ఐదు వన్డేల సిరీస్ లో 3-1 తో భారత్ ఆధిక్యంలో ఉంది.

93 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 39 పరుగులకే మార్టిన్‌ గప్టిల్‌(14), కేన్‌ విలియమ్సన్‌(11)ల వికెట్లను చేజార్చుకున‍్నప్పటికీ.. నికోలస్‌(30 నాటౌట్‌), రాస్‌ టేలర్‌(37 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి, తమ జట్టుకు ఈ సిరీస్ లో తొలి విజయం అందించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌ 92 పరుగులకు ఆలౌటై, రెండో అత్యల్ప స్కోర్ కు ఆలౌట్ అయిన చెత్త రికార్డు మూటగట్టుకుంది. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఐదు వికెట్లు తీయగా, గ్రాండ్‌ హోమ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ధావన్‌(13), పాండ్యా(16), చహల్‌(18), కుల్దీప్‌(15) మాత్రమే రెండంకెల స్కోరును చేశారు. రాయుడు(0), కార్తీక్‌(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్‌ గిల్‌(9) కూడా నిరాశ పరిచాడు. జాదవ్‌(1) కూడా వెంటనే ఔట్ కావడంతో భారత్ కోలుకోలేకపోయింది. చివర్లో చహల్‌, కుల్దీప్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్ ఈ మాత్రం స్కోరును సాధించగల్గింది. కాగా, 2010లో దంబుల్లాలో న్యూజిలాండ్‌ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 88 పరుగులకే ఆలౌట్ అయింది.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article