మూడోదీ మనదే

TEAM INDIA WON THIRD ODI

  • మూడో వన్డేలో టీమిండియా విజయభేరి
  • రాణించిన రోహిత్, కోహ్లీ.. సిరీస్ కైవసం

టీమిండియా జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ విజయభేరి మోగించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. రోహిత్ శర్మ 62 (77 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ 60 (74 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్థసెంచరీలు సాధించడంతో 43 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసి విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా.. 39 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అప్పుడే క్రీజ్ లో కుదురుకుని ధాటిగా బ్యాట్ ఝలపిస్తున్న శిఖర్ ధావన్ 28 (27 బంతుల్లో 6 ఫోర్లు) బౌల్ట్ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్ కు కోహ్లీ జతకలిసి, స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. వీరిద్దరూ కలసి మూడో వికెట్ కు 113 పరుగులు జోడించిన అనంతరం శాంటర్న్ బౌలింగ్ లో రోహిత్ శర్మ స్టంప్ అవుటయ్యాడు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే బౌల్ట్ బౌలింగ్ లో నికోలస్ క క్యాచ్ ఇచ్చి కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 168 పరుగులకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అంబటి రాయుడు 40 (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ 38 (38 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్) ధాటిగా ఆడటంతో టీమిండియా మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్ల పడగొట్టగా.. శాంటర్న్ ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు భారత బాలర్లు విజృంభించడంతో కివీస్ జట్టు 243 పరుగులకు ఆలౌట్ అయింది. రాస్‌ టేలర్‌(93), టామ్‌ లాథమ్‌(51) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 26 పరుగులకే మున్రో(7), గప్టిల్‌(13) వికెట్లను కోల్పోయింది. తర్వాత విలియమ్సన్‌(28) పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ దశలో టేలర్‌-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్‌ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, లాథమ్‌ కూడా అర్థ శతకంతో మెరిశాడు.  హాఫ్‌ సెంచరీ సాధించిన లాథమ్‌ స్కోరును పెంచే క్రమంలో ఔటయ‍్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్‌, సాంత్నార్‌లు ఔటయ్యారు. షమీ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఏడో వికెట్ గా టేలర్ వెనుతిరిగాడు. తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు వరుసపెట్టి పెవిలియన్ కు క్యూ కట్టడంతో 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా.. హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. కాగా, నాలుగో వన్డే హామిల్టన్ లో గురువారం జరగనుంది.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article