టీమిండియా72 ఏళ్లలో తొలిసారిగా

After 72 years first time Team India won

  • ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా
  • వర్షం కారణంగా చివరి రోజు ఆట రద్దు
  • డ్రాగా ముగిసిన ఆఖరి టెస్టు.. 2-1తో సిరీస్ కైవసం

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎన్నాళ్ల నుంచో అందని ద్రాక్షలా ఉండిపోయిన టెస్టు సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 72 ఏళ్లకు ఆసీస్ లో టెస్టు సిరీస్ గెలుపొందిన భారత్.. తిరుగులేని శక్తిగా అవతరించింది. సిడ్నీలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో సోమవారం ఐదోరోజు వర్షం కారణంగా ఒక్క బంతీ పడకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో దక్కించుకుంది. సిరీస్ ఆద్యంతం ఒక్క టెస్టులో మినహా అన్ని రంగాల్లోనూ రాణించిన టీమిండియా.. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. 2-1 ఆధిక్యంతో ఐదో టెస్టును ప్రారంభించిన భారత జట్టు అదరగొట్టింది. పుజారా, పంత్ ల సెంచరీలతో తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 622 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. మన బౌలర్ల ధాటికి 300 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. సొంత గడ్డపై 31 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ కు దిగిన ఆసీస్ ను కుప్పకూల్చి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని కలలు కన్న భారత్ కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. వర్షం కారణంగా నాలుగోరోజు నిర్ణీత సమయానికంటే ముందుగానే మ్యాచ్ ముగించాల్సి వచ్చింది. అప్పటికి ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇంకా 316 పరుగులు వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఆసీస్ ను ఆలౌట్ చేసి విజయం సాధించాలని భారత్ భావించగా.. డ్రా చేసుకోవాలని ఆసీస్ తలచింది. అయితే, చివరిరోజు కూడా వర్షం రావడంతో మ్యాచ్ సాగలేదు. కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే చివరి రోజు ఆటను రద్దు చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై విజయ పతాకం ఎగురవేసింది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లలో తొలి టెస్టును భారత్‌ కైవసం చేసుకోవడం విశేషం. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి. కాగా, చివరి మ్యాచ్ లో సెంచరీ (193) చేసిన చతేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్‌లో పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్‌ షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article