Team Indian traveling to wards victory
· తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగులకు ఆసీస్ ఆలౌట్
· 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఫాలోఆన్ ఆడుతున్న కంగారూలు
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. మన బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగులకే ఆలౌట్ అయింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. 20 ఓవర్లు ఆడి 64 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. కుల్‌దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ 322 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో ఆసీస్ ఫాలో ఆన్ ఆడుతోంది. 30 ఏళ్ల తర్వాత సిడ్నీలో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం విశేషం. నాలుగో రోజు ఆసీస్ ఇన్నింగ్స్ త్వరగా ముగించాలన్న టీమిండియా వర్షం అడ్డు నిలిచింది. ఫలితంగా మ్యాచ్ మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైన్పటికీ టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాట్స్ మెన్ భరతం పట్టారు. మ్యాచ్ ప్రారంభమైన ఆరు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి టెయిలెండర్లపై ఒత్తిడి పెంచారు. 85వ ఓవర్లో షమీ వేసిన బంతికి పాట్ కమిన్స్(25) బౌల్డ్ అయ్యాడు. తర్వాత హాండ్స్‌కాంబ్ (37)ను బుమ్రా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 91వ ఓవర్లో కుల్‌దీప్ వేసిన బంతికి లైయన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి పైన్ సేన 258 పరుగులు చేసింది. తొమ్మిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌కు టెయిలెండర్లు ఊతమిచ్చారు. వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడారు. 10 ఓవర్లలో 42 పరుగులు జోడించారు. 105వ ఓవర్లో చైనామన్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన హేజిల్‌వుడ్(21).. ఎల్బీగా వెనుదిరిగాడు. భారత్ కు 322 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆసీస్ ఫాలో ఆన్ ఆడక తప్పలేదు. వర్షం కారణంగా మళ్లీ ఆట నిలిచిపోయే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇంకా 316 పరుగులు వెనకబడి ఉంది. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. వర్షం రాకుంటే భారత విజయం ఖరారైనట్టే. ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ సొంతం చేసుకోనుంది. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది.