ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానానికి చేరాలి

Telangana Must Reach First Place in Health Index

– వైద్యశాఖకు బడ్జెట్‌ డబుల్‌ చేసుకున్నాం
– పోటీ పడి, నూతనోత్సాహంతో పని చేయాలి
– ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరగాలి
– సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలి
– ప్రైవేటులో సి-సెక్షన్లపై పరిశీలన చేయాలి
– ఇక నుంచి నెలవారీగా సమీక్ష ఉంటుంది
– అందరూ రిపోర్టులతో సిద్ధంగా ఉండాలి
– మంచి పనితీరు కనబర్చితే ప్రత్యేక గుర్తింపు
– విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు
– ఈ నెల 7 న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ‘ఉత్తమ సిబ్బంది’కి సన్మానం
– వైద్యారోగ్య సిబ్బంది, అధికారులతో మంత్రి హరీశ్‌ రావు టెలికాన్ఫరెన్స్‌

ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచించారు. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని, రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతనోత్సాహంతో పని చేయాలని చెప్పారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఆశాలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలతో మంత్రి హరీశ్‌ రావు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, డీహెచ్‌ శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్‌ సెంటర్‌, పీహెచ్‌సీల వారీగా పురోగతిని సమీక్షించారు. ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లతో మంత్రి మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్‌సీ చెకప్స్‌, డెలివరీలు, ఎన్‌సీడీ ప్రోగ్రాం, వ్యాక్సినేషన్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరేఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందన్నారు. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలన్నారు. అందరం కలిసి పని చేయడం వల్ల ఎంఎంఆర్‌ సూచీలో తమిళనాడును అధిగమించి దేశంలో రెండో స్థానానికి చేరుకున్నామన్నారు. ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యమని, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలన్నారు.

* మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలకు ఈనెల 7న వరల్డ్‌ హెల్త్‌ డే పురస్కరించుకొని నగదు ప్రోత్సాహంతో పాటు సన్మానం ఉంటుంద‌న్నారు. ప్ర‌తి విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి స‌న్మానిస్తామ‌ని చెప్పారు. ఇక‌పై ప్ర‌తి మూడు నెలలకొకసారి ఇలాంటి కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. అదే స‌మ‌యంలో.. పని చేయని వారిపై చర్యలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

* ఏఎన్‌సీ చెకప్స్‌ సక్రమంగా నిర్వహించాలని, గర్బిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే సెక్షన్లపై గైనకాలజిస్టుల వారీగా పరిశీలన నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటం పట్ల పరిశీలన చేయాలని, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెల అన్ని పారామీటర్ల మీద సమీక్ష ఉంటుందని, ప్రతి ఒక్కరు రిపోర్టులతో సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు ఎక్కువగా ఫీల్డ్‌ విజిట్స్‌ చేయాలని, పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణలు వారానికి ఒక జిల్లాకు వస్తారని, సర్‌ప్రైజ్‌ విజిట్స్‌ చేస్తారని తెలిపారు. పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని, ఇదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆశా కార్యకర్తల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు సార్లు పెంచి, ప్రస్తుతం రూ.9750 పారితోషకాన్ని ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అందరం కలిసి శ్రమించి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article