తెలంగాణ అభివృద్ధిలో ముందంజ

313

ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ అన్ని రంగాలలో ముందు వరుసలో నిలవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని, అయితే ప్రజలందరూ తమ వంతు కృషితో ఈ కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలని గవర్నర్ పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటుచేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ, ఐటీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో ముందంజలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అలాగే తన జన్మదినం కూడా జూన్ 2 నాడే కావడం దైవ సంకల్పం గా తాను భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. ఈసారైనా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామనుకుంటే కోవిడ్ రెండో దశతో సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలందరూ సరైన నిబంధనలు పాటించి, వ్యాక్సిన్ తీసుకొని కోవిడ్ మరిన్ని దశలను నివారించాలని డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో బలిదానాలు చేసిన ఎంతోమంది అమరవీరులకు గవర్నర్ నివాళులు అర్పించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అసమాన సేవా నిరతిని చాటుకుంటున్న వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బందికి గవర్నర్ కృతజ్ఞతలు తెలుపుతూ సెల్యూట్ చేశారు.
విపత్కరమైన కోవిడ్ పరిస్థితులలో రక్తదానం చేయడం, ప్రోత్సహించడం, అలాగే ఇతర సేవా కార్యక్రమాలు ముందుండి నడిపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ లను సత్కరించారు. మిలిటరీ అధికారులైన ఏ. జోషి, ఇంద్ర దీప్ సింగ్ లతో పాటు గాంధీ ఆసుపత్రి, కింగ్ కోటి హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ కె. పిచ్చి రెడ్డి, వాలంటీర్ లను కూడా గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసు అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది, అధికారులు, ఇతర సన్మాన గ్రహీతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్, గవర్నర్ సెక్రెటరీ కె. సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here