ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు

35

ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. క్యాబినెట్ ఆమోదం పొందిన పీఆర్సీ నివేదిక (జీవో ఎంఎస్ 51) ప్రతిని కూడా విడుదల చేసింది. 30 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ అమల్లోకి రానుంది. ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి పది (జీవో ఎంఎస్ నెంబర్ 51 – 60) ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను సవరించింది. 2018 జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలుగా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రామగుండం, వరంగల్‌లో 17 శాతం, 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్న 42 పట్టణాల్లో 13 శాతం, ఇతర ప్రాంతాల్లో 11 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను అలాగే కొనసాగిస్తారు.

  • 2018 జూలై తర్వాత పదవీవిరమణ అయిన ఉద్యోగులకు కూడా 2020 పీఆర్సీ ప్రకారమే ఫించన్ చెల్లించనున్నారు. కనీస ఫించను 6500 నుంచి 9500కు పెరగనుంది. పెన్షనర్లకు 36 వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నారు. రిటైర్మెంట్ గరిష్ట గ్రాట్యుటీని కూడా 12 నుంచి 16 లక్షల రూపాయలకు పెంచారు. పెన్షనర్లు, వాళ్ళ కుటుంబసభ్యులకు మెడికల్ అలవెన్స్ నెలకు 350 నుంచి 600 కు పెంచడం జరిగింది. అదే సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా 30 శాతం పెరగనున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15,600, రూ.19,500, రూ.22,750 గా ఉండనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here