- తొందరగా వెళ్లాలనుకుంటే ప్రమాదాలు జరుగుతాయి…!
- ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు, ప్రపంచం ఆగిపోదు…
- ప్రమాదం వీడియోను ట్వీట్ చేసిన టిజిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్
సిగ్నల్ పడినప్పుడు ఆగే ఓపిక కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరమని టిజిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. తొందరగా వెళ్లాలన్న ఆత్రుతతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవని, ప్రపంచం ఆగిపోదని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ సమీపంలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద వేగంగా వెళ్తూ కారు మరో కారుని ఢీ కొట్టింది.
ఈ క్రమంలోనే స్పీడ్‌గా వచ్చిన కారు పల్టీలు కొడుతూ పల్టీకొట్టింది. వెంటనే సిగ్నల్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్, ఇతర వాహనదారులు వచ్చి కారు డ్రైవర్‌ను బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టిజీఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
వాహనదారులు గుర్తుపెట్టుకోవాలని, ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారురు. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు కారణమైన బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చకూడదని ఆయన సూచించారు.