Monday, November 18, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది

అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడినా కఠినచర్యలు తప్పవు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహారిస్తోంది
బిఆర్‌ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు మంచి పద్ధతి కాదు
హైదరాబాద్‌లో ఉన్న వారిపై తాము ఏనాడు వ్యతిరేకంగా మాట్లాడలేదు
పదేళ్లు పరిపాలించిన వారు పదినెలలు కూడా ఓపిక పట్టలేరా
బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠినచర్యలు తప్పవని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహారిస్తోందని ఆయన అన్నారు. ఆదివారం పిసిసి అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం గాంధీభవన్‌కు వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అధికార పక్షం వారైనా, ప్రతిపక్షం వారైనా పోలీసులకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. బిఆర్‌ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీని రెచ్చగొట్టారని, అయితే ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారిపై తాము ఏనాడు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. కెసిఆర్ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ‘బిర్యానీ మాది పెండ మీది’ అని కెసిఆర్ అనలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రోళ్లపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోను కెటిఆర్‌కు పంపుతానన్నారు. పదేళ్లు పరిపాలించిన వారు పదినెలలు కూడా ఓపిక పట్టకపోతే దానిని అసహనం అంటారని మంత్రి పేర్కొన్నారు.

ఫిరాయింపుల్లో మాస్టర్ బిఆర్‌ఎస్..
తాము ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, ఫిరాయింపుల్లో మాస్టర్ బిఆర్‌ఎస్ అని, ఈ విషయంలో ఆ పార్టీ డాక్టరేట్ సాధించిందని పొన్నం సెటైర్ వేశారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక టిడిపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ సభ్యులను చేర్చుకుందని ఆయన గుర్తు చేశారు. పార్టీకి రాజీనామా కూడా చేయని టిడిపి వ్యక్తిని బిఆర్‌ఎస్‌లో అనైతికంగా చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర ప్రజలు మరువలేదన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి గొంతు కలిపి తమ ప్రభుత్వాన్ని కూలగొడతామన్న మాట నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. పేదల కోసం పని చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుంటే వారిపై బురద జల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు. వారు చేస్తే రాజకీయ నీతి, తాము చేస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు.

చిల్లరగాళ్లను పట్టించుకోవద్దు
కాంగ్రెస్ దళిత వ్యక్తిని సీఎల్పీ లీడర్ చేస్తే ఓర్వలేక తమ పార్టీని బలహీన పర్చలేదా అని మంత్రి ప్రశ్నించారు. తాము ఏనాడూ ప్రతిపక్షాల గొంతు నొక్కలేదని, అసెంబ్లీలో వారి వాదనలు వింటున్నామని, ధర్నాచౌక్‌లో ధర్నాలకు అవకాశం ఇచ్చామన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా జాగ్రత్త అని మంత్రి హెచ్చరిం చారు. గాంధీ, కౌశిక్ చేసింది తప్పేనని, కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని, భౌతిక దాడులు మంచివి కావని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదని మంత్రి అన్నారు. సిఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేసే చిల్లరగాళ్ల సంగతి చూస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. చిల్లరగాళ్లను పట్టించుకోవద్దని తమ సిఎం చెప్పారని అందుకే సైలెంట్‌గా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఎవరూ వ్యవహారించకూడదన్నారు. ఫులే పేరు పెట్టుకొని తాము ప్రజాపాలన అందిస్తున్నామని పొన్నం చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular