TICKET PANCHAYATHI IN TDP JAMMALAMADUGU
ఒకపక్క ఎన్నికల సమీపిస్తుంటే జమ్మలమడుగు జగడం రోజుకో రూపు తీసుకుంటుంది. ఇప్పటికి పలు మార్లు నచ్చచెప్పినా పంచాయతీ మాత్రం తేలేలా కనిపించడం లేదు. పేరుకు సీనియర్ నాయకులైనా రామసుబ్బారెడ్డి , ఆది నారాయణ రెడ్డి లు చీటిమాటికి బయటపడి, వివాదాలు రోడ్డు కెక్కించి అధికార పార్టీ పరువు తీస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరువురు నేతలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ఇక లాభం లేదని రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు పంచాయితీ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య గతంలోనే రాజీ ఫార్ములా వారిముందుంచిన చంద్రబాబు మరోసారి వారితో మాట్లాడనున్నారు. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేసేలా వారి మధ్య రాజీ ప్రయత్నం చేశారు. దీనికి గతంలో అంగీకరించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీగా పోటీచేసేవారు ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అధినేత హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే గా పోటీ చేస్తే రామసుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేసేటట్లు ఉంటే.. ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తారో వాళ్లకే ప్రత్మామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎంపీగా పోటీ చేస్తారని, ఎమ్మెల్సీ పదవి వద్దు అనుకున్న వారు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు ప్రతిపాదించినట్లు పార్టీ నేతలు అనుకుంటున్నారు. దీంతో ఇవాళ సాయంత్రానికి ఈ పంచాయితీ తెరపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.