Rahul Gandhi Gave surprise gift TO Trans Genders
జాతీయ స్థాయిలో ఓ ట్రాన్స్ జెండర్ కు అత్యంత గౌరవ ప్రదమైన హోదా దక్కింది. అది కూడా దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ లో … ఎవ్వరూ ఊహించని విధంగా రాహుల్ తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీ ట్రాన్స్‌జెండర్లకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. దేశంలో మహిళా కాంగ్రెస్ అభివృద్దే లక్ష్యంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆమెలా మారిన అతనికి రాహుల్ గాంధీ ఉన్నత పదవి కట్టబెట్టారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఏఐఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ అప్సరారెడ్డి నియమించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 133 ఏళ్ల చరిత్రలో.. జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌కు ఈ పదవి ఇవ్వటం ఇదే మొదటిసారి.
గతంలో జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పనిచేశారు ట్రాన్స్‌జెండర్ అప్సరారెడ్డి. బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల్లాంటి సామాజిక అంశాలపై ఆమె కృషి చేశారు. అంతేకాదు ఆమె బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల్లో కూడా పని చేశారు. కాగా మహిళా కాంగ్రెస్ లోకి అప్సరారెడ్డిని స్వాగతిస్తున్నట్లు ఏఐఎంసీ అధ్యక్షురాలు ఎంపీ సుస్మితాదేవ్ తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ కుటుంబంలో అప్సరారెడ్డిని సభ్యురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ అప్సరారెడ్డి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ.. మహిళల అభ్యన్నతి కోసం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తాను. మహిళలకు ఆర్థిక సాధికారత సాధించడం కోసం వివిధ రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ శాఖల అధ్యక్షురాళ్లతో కలిసి పని చేస్తాను’’ అని హామీ ఇచ్చారు.