జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ అర్థం లేని విమర్శలు
యువతకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్, హరీష్ రావు కుట్ర
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియా మాట్లాడారు. ఎంపీగా కేంద్ర టూరిజం మంత్రిగా గత ఐదేళ్లలో కేంద్రం నుంచి హెరిటేజ్, టూరిజం, ఆర్కియాలజీ శాఖ నుంచి హైదరాబాద్ కు ఏం తీసుకొచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదని, అమృత్ పథకం నుంచి ఒక్క రూపాయి తేలేదన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి ఎంచేశారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి నిధులు కావాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ముందుకు పోదామని అన్నారు. ఉస్మానియా, నిమ్స్ హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కోరారు.కేటీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తేలేకపోరని, భూకబ్జాలు, అక్రమ కట్టడాలతో హైదారాబాద్ ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. నియామక పక్రియ ప్రారంభమైన తర్వాత అడ్డుకునే యత్నం చేస్తుంది వీళ్లేనని ఆరోపించారు. విద్యార్థులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవొద్దని కోరారు. పదేళ్లలో డీఎస్సీ పోస్టులు భర్తీ చేయనివారు విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.