Transport Employees are involved in Illegal wood transportation .. 6గురిపై వేటు
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు.ఇక అందుకే పోలీసులు, అధికారులు కుమ్మక్కై కలప అక్రమ రవాణాకు పాల్పడ్డారు.నిజామాబాద్ జిల్లాల్లో వెలుగు చూసిన కలప అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అటవీశాఖ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు చేతులు కలిపి యథేచ్చగా కలప స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు షురూ అయ్యాయి. ఈకేసుతో సంబంధం ఉన్న పోలీసు, అటవీశాఖ అధికారులపై వేటు పడింది. ఈరెండు శాఖల్లో మొత్తం ఆరుగురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా కలప అక్రమ రవాణకు పాల్పడ్డ అధికారులు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు పడుతోంది.
ఇప్పటికే నిజామాబాద్ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్‌ఐని విధుల నుంచి తొలగించిన పోలీసుశాఖ ఇప్పుడు మరో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. స్మగ్లింగ్‌ను అరికట్టడంలో విఫలమైన ముగ్గురు అటవీ శాఖ అధికారులు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెండైన అటవీశాఖ అధికారుల్లో జిల్లాస్థాయి అధికారి అయిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వేణుబాబు ఉన్నారు. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభియోగంపై ఈ ముగ్గురిపై వేటు వేశారు. ముగ్గురు ఉన్నత స్థాయి అటవీ అధికారులపై చర్య తీసుకోవడంతో… ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మిలిగిన అధికారుల వెన్నులో వణుకుమొదలైంది. కలప అక్రమ రవాణలో ప్రాతధారులు, సూత్రధారులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు.
ఈవ్యవహారంతో సంబంధం ఉన్న నిజామాబాద్ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్‌ఐ షకీల్ పాషాను సస్పెండ్ చేసిన పోలీసు శాఖ. ఇప్పుడు మరో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. కలప అక్రమ రవాణకు సహకరించారన్న అభియోగంపై నిర్మల్ జిల్లా ఇచ్చోడ సీఐ, నేరేడుగొండ ఎస్‌ఐని, కరీంనగర్ డీఐజీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలప అక్రమ రవాణ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. వీరిలో నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఫహీం కూడా ఉన్నారు. కలప స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కొనసాగుతున్న తరుణంలో మరికొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు, అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.