TRS MLA SHOCKING COMMENTS .. ఓటేయ్యకుంటే మా డబ్బులు కక్కేయ్యండి
నల్గొండ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే తిన్న డబ్బులు తిరిగి కక్కేయ్యండి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దామరచర్ల మండలం కొండ్రపోలులో టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరపున పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన వారు టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలన్నారు. అంతటితో ఆగని ఆయన మాకు ఓటేయకపోతే మా డబ్బు తిరిగి ఇచ్చేయాలని అన్నారు. టీఆర్ఎస్ వ్యక్తులు కాకుండా ఇతరులు సర్పంచ్‌గా ఉంటే గ్రామం అభివృద్ధి చెందదని చెప్పారు. మాకు ఓటేయకపోతే మా డబ్బు మాకు తిరిగిచ్చేయాలని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌తో స్థానికులు షాక్ తిన్నారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు.
మాకు ఓటు వేసి గెలిపించండి అని అడగొచ్చు.. లేదా ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వొచ్చు.. కానీ.. ఇలా బెదిరింపులకు దిగడం ఏంటని? మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటున్నారు. ఇలాంటి బెదిరింపులను తాము లెక్క చేయమన్నారు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేసి గెలిపిస్తామన్నారు. విపక్షాలు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నాయి. బెదిరింపు రాజకీయాల వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మొత్తానికి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే అనవసరంగా లేని తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు.