TRS MLAs Requesting To Release Constituency Development Funds
తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలకు నిధులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లు నిధుల కోసం మంత్రులతో పాటు సీఎం కేసీఆర్ కుఆర్థిక మంత్రి హరీశ్ రావు , మంత్రి కేటీఆర్ కు విన్నపాలు వినవలె అంటూ అవకాశం దొరికినప్పుడల్లా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ఎన్నికలు రావడంతో పనులు పక్కన పెట్టి ఎన్నికలలో గడిపారు. ఇక ఇప్పుడు ఒక్క జీహెచ్ ఎంసీ ఎన్నికలు తప్ప మరే ఇతర ఎన్నికలు లేకపోవటంతో నియోజకవర్గాల్లో హామీ ఇచ్చిన పనులకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలే కాకుండా గత పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక పనులపై ఫోకస్ పెడతామని అభివృద్ధి చేద్దామని భావిస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు లేకపోవడం షాక్ కు గురి చేస్తుంది .
ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే ప్రారంభమవుతుండడంతో తమ నియోజకవర్గాలకు నిధులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లు – తాగునీరు – డ్రైనేజీ – పారిశుద్ధ్యం తదితర సమస్యల పరిష్కారానికి నిధులు కోరుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏడాదికి రూ.3 కోట్ల నిధిని కేటాయించేవారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ నిధి ఎమ్మెల్యేలకు కేటాయించలేదు. దీంతో గ్రామాలకు వెళ్లినప్పుడు చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి కూడా ఎమ్మెల్యేలు ఏం చెయ్యలేకపోతున్నారు . బడ్జెట్ లో నియోజకవర్గాలకు నిధులు భారీగా కేటాయించాలని కోరుతూ ఆర్థిక మంత్రి హరీశ్ రావును కోరుతున్నారు.హైదరాబాద్ లోని అరణ్య భవన్లో బడ్జెట్ కోసం మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు అరణ్యభవన్ కు వెళ్లి మంత్రిని కలిస్తున్నారు. పెండింగ్ పనుల జాబితాను వాటి అంచనాలను రూపొందించి మంత్రికి ఇస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలంతా ప్రగతి భవన్ కు వెళ్లి అక్కడ సీఎం కేసీఆర్ ను కూడా కలిసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. మరి చూడాలి ఈ బడ్జెట్ సమావేశాలు ఎమ్మెల్యేలకు ఏ మేరకు నిధులు సమకూరుస్తాయో ..