ఆదిలాబాద్‌లో పొలిటికల్ హీట్ .. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ 

 TRS VS BJP

ఆదిలాబాద్‌లో పొలిటికల్ సెగ.. కారు వర్సెస్ కాషాయం అన్నట్టు తయారైంది.  ఆదిలాబాద్ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పార్టీకి  చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెంచుతోంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో రెండు పార్టీల మధ్య పోటీ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ దూకుడుకు.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఎంపీ స్థానాన్ని అవలీలగా కొట్టేసింది. తాజాగా సభ్యత్వ నమోదులోనూ ఈ రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. ..
ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. క్యాడర్, లీడర్ బలంగా ఉన్న పార్టీగా దూసుకెళుతోంది. అయితే బీజేపీ పరిస్థితి వేరు. మోడీ ఛరిష్మానో లేదంటే బీజేపీ పవరో ఏమోగానీ ఇప్పుడిప్పుడే అంతో ఇంత బలం కూడగట్టుకుంటోంది. క్యాడరున్నా.. లీడర్లు లేని కాషాయం దండు మరి ఎలా ముందుకెళుతుందనేది పెద్ద ప్రశ్న. అయినప్పటికీ గులాబీ వనానికి చెక్ పెట్టేలా కాషాయం జెండా రెపరెపలాడేలా బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు.  మొన్నటి లోక్ సభ ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించాయని చెప్పొచ్చు. టీఆర్ఎస్ బలాన్ని, బలగాన్ని ఢీకొట్టి మరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అదే ఊపుతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు పార్టీ పెద్దలు. ఆ క్రమంలో సభ్యత్వ నమోదును టార్గెట్ చేసి వీలైనంత ఎక్కువ మందికి కమల తీర్థం పోయాలని డిసైడయ్యారు.  పార్టీ బలోపేతానికి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలో జిల్లాలో సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాయి. టీఆర్ఎస్‌కు గతంలో కంటే 50 శాతం సభ్యత్వాలు అధికం కాగా.. బీజేపీకి మాత్రం మూడింతలు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్‌ బాపురావు, లోక భూమారెడ్డి నేతృత్వంలో సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టారు. ఇక బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో మెంబర్‌షిప్ క్యాంపెయిన్ ఉధృతం చేశారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, రాజాసింగ్ లాంటి నేతలను జిల్లాకు రప్పించారు. ఆ క్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదులో ఊపు కనిపించింది.
జిల్లాలో సభ్యత్వ నమోదులు పరిశీలించినట్లైతే ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీఆర్ఎస్‌కు 50 వేల సభ్యత్వాలు నమోదు కాగా.. బీజేపీకి 39 వేల వరకు వచ్చాయి. బోథ్ నియోజకవర్గం పరిధిలో గులాబీకి 40 వేలు రాగా.. కాషాయం దండుకు 22 వేలు వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆసిఫాబాద్, ఖానాపూర్ సెగ్మెంట్లలోని పలు మండలాల్లో బీజేపీకి మరో 19వేల వరకు సభ్యత్వాలు వచ్చాయనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. టీఆర్ఎస్, బీజేపీ.. ఈ రెండు పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాయనేది ఓ టాక్. ఆ క్రమంలో యువత కూడా పోటాపోటీగా ఈ రెండు పార్టీల్లో చేరిపోయారు. కౌన్సిలర్లుగా పోటీ చేద్దామని ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అటో ఇటో మొత్తానికి ఏదో పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భాలు కనిపించాయి. మొత్తానికి రానున్న రోజుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.

tags:trs, bjp, adilabad, soyam bapurao, membership drive , competition
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article