ముదురుతున్న పొలిటికల్ వార్ ..

Spread the love

TRS vs BJP

టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికల తర్వాత ఓటమిని జీర్ణిచుకోలేని టీఆర్‌ఎస్‌ నేతలు తమ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. పోలీసులు సైతం వారికి వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.

తెలంగాణలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే.. పట్టు నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది.. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని టీఆర్‌ఎస్‌ తట్టుకోలేకపోతుందంటూ కమల దళం ఆరోపిస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేక ఏకంగా బీజేపీ కార్యకర్తలపై దాడులులకు దిగుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న యువకులు, విద్యార్థులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో పోలీసులు టీఆర్ఎస్ నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని పేర్కొంటున్నారు.

బీజేపీ కార్యకర్తలపై దాడులు సహించబోమన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొడిముంజ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు విచక్షణా రహితంగా దాడులు చేసారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా బాదితులపైనే 307సెక్షన్ కింద కేసునమోదు చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదనీ, జాతీయ బీసీ కమిషన్ తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.. పోలీసులు తీరుమార్చుకోక పోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని.. శాంతిభద్రతల సమస్య తలెత్తితే బాధ్యత తమది కాదని హెచ్చరించారు.

అటు తెలంగాణలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ బృందం తీసుకెళ్లింది. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కార్యకర్తలపై దాడులు, మరో కార్యకర్త హత్య గురించి తెలియజేసింది . కేసీఆర్‌ పాలన తీరును, బీజేపీ పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరిని నడ్డాకు వివరించింది. కేంద్రం, జాతీయ నాయకత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందని నడ్డా హామీ ఇచ్చారని పార్టీ నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *