TS CABINET WITH 10 MEMBERS
- పూర్తయిన ప్రమాణ స్వీకారం
తెలంగాణ మంత్రిమండలి కొలువుతీరింది. మంగళవారం రాజ్ భవన్ లో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 25 నిమిషాలు సాగింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ తమ తమ స్థానాలకు వచ్చిన తర్వాత జాతీయగీతం ఆలపించారు. అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకార ప్రక్రియ ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ పది మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి ఒక్కొక్కరిని వేదికపైకి పిలవగా.. వారు వేదికపైకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణం చేయగా.. అనంతరం వరుసగా తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.