* తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్స్
* ‘నీ’ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీస్
* బస్తీ దవాఖానలు, ఈవినింగ్ క్లీనిక్‌లు
* 50 శాతానికి పైగా కార్యక్రమాలకు కేంద్ర నిధులే!
కేంద్రం సొమ్ముతో టీఆర్ఎస్ ప్రభుత్వం సోకు చేస్తోంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. బీజేపి నాయకులు మాత్రం సోయి లేకుండా కనిపిస్తున్నారు. విషయానికి వస్తే ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖలో గత ప్రభుత్వాలు చేయని భారీ మార్పులు చేస్తూ సీఎం కేసీఆర్ విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని రెండు రోజుల క్రితం గ్రేటర్లో ప్రారంభించిన టీ-డయగ్నోస్టిక్స్ మినీ హబ్‌ల ప్రారంభోత్సవంతో పాటు ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు పలువురు మంత్రులు, నాయకులు పదే పదే ఊదరగొట్టి చెబుతున్నారు.
వాస్తవానికి గ్రేటర్లో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్స్‌ను నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం), నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధులతో ఏర్పాటు చేసినట్లు స్వయాన కుటుంబ సంక్షేమ శాఖ అధికారులే చెబుతున్నారు. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి మరీ మరీ నొక్కి చెబుతున్న ‘నీ’ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీస్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నవే. మొన్నటి వరకు మాకు వద్దే వద్దన్న ఆయుష్మాన్‌ను ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయుష్మాన్ భారత్ కిందనే రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో ఈ మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి తదితర శస్త్రచికిత్సలు సైతం ఆయుష్మాన్ భారత్ కిందనే చేస్తున్నారు. మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించిన ఇంప్లాంట్స్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు. అందుకని మొన్నటి వరకు నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిపినా ఇంప్లాంట్స్ మాత్రం రోగులే కొనుగోలు చేసుకునేవారు. ఆయుష్మాన్ భారత్‌ను అడాప్ట్ చేసుకున్న తరువాత రాష్ట్రంలో నిరుపేదలు ఎంతో మంది ఉచితంగా మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడితో పాటు పలు ఖరీదైన శస్త్రచికిత్సలను పొందుతున్నారు. కానీ, ఈ శస్త్రచికిత్సలన్నీ తమ ప్రభుత్వమే చేయిస్తున్నట్లు టీఆర్ఎస్ మంత్రులు మాత్రం పదే పదే ఊదరకొడుతూ ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ డయాగ్నోస్టిక్ కింద రేడియాలజి ల్యాబ్‌లను సైతం అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం.
* ఈ టీ-హబ్సే కాదు బస్తీ దవాఖానలు, ఈవినింగ్ క్లీనిక్‌లు, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ నేషనల్ హెల్త్ మిషన్ తదితర కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో చేపడుతున్నవే. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులతో చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం సోయి లేకుండా వాటిని ఖండించలేకపోవడం విడ్డూరం.