TSRTC Stoping Bus Servises To Hajpur
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వరుస హత్యల కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణలో ఉంది. ఒకపక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో హాజీపూర్ లో మరోసారి ఆందోళన నెలకొంది. వరుస హత్యాచారాల నేపథ్యంలో గ్రామానికి బస్సులను పెంచిన ఆర్టీసీ తాజాగా ఆదాయం రావడం లేదనే కారణంతో సర్వీసులను రద్దు చేసింది. దీంతో ఆ ఊరు నుంచి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి అమ్మాయిలకు ఇది మరింత ఇబ్బందిగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందు వరకు ఈ ప్రాంతానికి బస్సులు అందుబాటులో ఉండేవి. సమ్మె విరమణ అనంతరం ఆదాయం వచ్చే మార్గాలు, రాని మార్గాలు అంటూ రూట్లను హేతుబద్ధం చేసే నెపంతో గ్రేటర్ ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సుల రద్దుకు చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే హాజీపూర్ గ్రామానికి సైతం బస్సులను రద్దు చేసింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్లనే స్కూళ్లకు నడిచే వెళ్లే అమ్మాయిలకు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తన బైక్ పైన లిఫ్ట్ ఇవ్వడం, అనంతరం వారిపై హత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.