టీవీలు, సినిమా టికెట్లు తగ్గాయ్

tv prices reduced in india

  • జీఎస్టీ పన్ను రేట్లలో సవరణలు
  • పలు వస్తువులు, సేవలపై పన్ను తగ్గింపు

ఎట్టకేలకు జీఎస్టీపై కేంద్రం కాస్త వెనక్కు తగ్గింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావమో, లేక లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణమనో తెలియదుగానీ, మధ్య తరగతి ప్రజలు విరివిగా వినియోగించే 23 వస్తువులు, సేవలపై పన్నును జీఎస్టీ మండలి తగ్గించింది. ధరలు తగ్గనున్న వాటిలో సినిమా టికెట్లు, టీవీ, కంప్యూటర్‌ తెరలు, పవర్‌ బ్యాంకులున్నాయి. శీతలీకరించిన, నిల్వ చేసిన కూరగాయలకు పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 18 శాతం పన్ను పరిధిలోని రూ.100 వరకున్న సినిమా టికెట్లను 12 శాతం శ్లాబులో చేర్చారు. రూ.100కు పైనున్న టికెట్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, టీవీ తెరలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి కుదించారు. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. 99 శాతం వస్తువులపై పన్నును 18 శాతం లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో తాజా రేట్ల కోత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 28 శాతం శ్లాబులో 28 వస్తువులు, సేవలే మిగిలాయి. ఆటో మొబైల్‌ పరికరాలు, సిమెంట్, మద్యం, సిగరెట్లు, ఇతర విలాసవంత వస్తువులు, సేవలే అందులో ఉన్నాయి. దివ్యాంగుల ఉపకరణాలపై ఉన్న ప్రస్తుత పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులో ఊత కర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. శీతలీకరించిన, ప్యాక్‌ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే, జీఎస్టీ రేట్ల కోతను బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నిర్ణయంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article