UAE King Visited Pakistan after 12 Years
· పొరుగుదేశానికి ఆర్థికసాయం ప్రకటించే అవకాశం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం పాకిస్తాన్ కు యూఏఈ ఆర్థికసాయం ప్రకటించే అవకాశం ఉందా? యూఏఈ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ పాకిస్థాన్ లో పర్యటించనున్న నేపథ్యంలో తమ దేశానికి భారీ సాయం ప్రకటిస్తారని దాయాది దేశం భావిస్తోంది. పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటిపోయిన నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తమను ఆదుకోవాలని పలు వేదికలపై అంతర్జాతీయ ద్రవ్య నిధిని (ఐఎంఎఫ్) కోరిన సంగతి తెలిసిందే. తమ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకురావడం సహా.. జీతాల సమస్యను నివారించుకొనేందుకు ఐఎంఎఫ్ నుంచి సుమారు 8 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని కోరింది. ఈ నేపథ్యంలో ఆదివారం యూఏఈ రాజు పాకిస్థాన్ పర్యటనకు వచ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత పాక్ వచ్చిన యూఏఈ రాజుకు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురూ సమావేశమై పాకిస్తాన్ కు ఆర్థిక సాయంపై చర్చించే అవకాశం ఉంది. యూఏఈ రాజు పాక్ కు 6.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశముందని ది డాన్ పత్రిక పేర్కొంది. దీనిపై ఇప్పటికే గతంలో ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరిగాయి. అయితే, తాజాగా యూఏఈ చేయబోయే ఈ ప్రత్యేక సాయంతో పాక్‌కు విదేశీ మారక నిల్వలు పెంచుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అవకాశం లభించనుంది. యూఏఈ ప్రకటించబోయే 6.2 బిలియన్ డాలర్లలో 3.2 బిలియన్ డాలర్ల సహకారాన్ని వాయిదాల పద్ధతిలో చమురు ఎగుమతుల ద్వారా అందిస్తామని, మిగతా మొత్తాన్ని నగదు రూపంలో జమ చేస్తామని యూఏఈ ప్రకటించే అవకాశముందని పాకిస్థాన్‌కు చెందిన ‘ద డాన్’ పత్రిక వెల్లడించింది.