జాతీయ స్థాయిలో మన పరువు గోవిందా?

66
credai hyderabad
credai hyderabad

Dont Encourage UDS Scheme

UDS Scheme Is Big Setback

దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ అనేక సంస్కరణలకు తెలంగాణ పెట్టింది పేరు. కొన్నేండ్ల నుంచి పెద్ద రాష్ట్రాలకే సాధ్యం కానీ అనేక రికార్డుల్ని తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంది. పీఎం రాష్ట్రమైన గుజరాత్, ఆర్థిక వ్యవస్థకు పెట్టినపేరైన మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ అనేక రంగాల్లో ముందంజలో దూసుకెళుతోంది. అతి తక్కువ కాలంలోనే ఇంత ఘనమైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో పోతుందా? మన ప్రతిష్ఠకే మసక ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుందా? ఇక్కడ అనుసరిస్తున్న ఓ తప్పుడు విధానం పట్ల జాతీయ స్థాయిలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోందా? అసలేమిటీ విధానం? దీన్ని ఎవరు ఆరంభించారు? దీనికి అంతమే లేదా?

గత కొంతకాలం నుంచి తెలంగాణలో కొనుగోలుదారులు ఫ్లాట్ల బదులు భూమిని కొనుగోలు చేస్తున్నారు. అంటే, ఫ్లాట్లు కొనేవారు సైతం నేరుగా ఫ్లాట్లను కొనకుండా స్థలాన్ని కొంటున్నారు. అది కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో. అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టుల్లో కూడా ఫ్లాట్లు, విల్లాల బదులు స్థలం కొనుగోలు చేస్తున్నారు. అసలు వీరంతా ఎందుకిలా కొంటున్నారు? అలా కొనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇలా కొనడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనేది మీ సందేహమా? * పశ్చిమ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో 1300 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా రూ.కోటి దాకా అవుతుంది. అంటే, హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుని, రెరా ఫైనల్ అప్రూవల్ తీసుకున్నాక ఒక బిల్డర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సుమారు రూ. కోటి రూపాయలకు అటుఇటుగా విక్రయిస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కోటి రూపాయలు పెట్టి డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఎంతమంది కొనగలరు? లేదు కదా.. అందుకే సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకర్షించడానికి కొందరు అక్రమార్క బిల్డర్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు అమ్మడం ఆరంభించారు. దీని ప్రకారం, ఒక చోట స్థలం ఉంటుంది, దానికి స్థానికసంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోరు, రెరా అనుమతి ఉండదు. కాకపోతే, ఫ్లాట్ కట్టిన తర్వాత అవిభాజ్యపు వాటా (అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ లాండ్) కింద ఎంతయితే స్థలం వస్తుందో అంత స్థలాన్ని అపార్టుమెంట్ కట్టకముందే అమ్మేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే, అపార్టుమెంట్ కేవలం పేపర్ లేదా బ్రోచర్ మీదే ఉంటుందన్నమాట. అనుమతి తీసుకున్నాక ఫ్లాట్ అమ్మితే కోటి రూపాయలు అవుతుంది కాబట్టి, కట్టక ముందే యూడీఎస్ స్థలాన్ని రూ.50 నుంచి రూ.60 లక్షలకే విక్రయిస్తున్నారు. కాకపోతే, ఈ సొమ్ముని ముందే ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. నెల రోజుల దాకా కొన్ని సంస్థలు గడువునిస్తున్నాయి.

తక్కువకే వస్తుంటే తప్పేంటి?

యూడీఎస్ కింద తక్కువ రేటుకే ఫ్లాటు వస్తుంటే తప్పేంటి అని వాదించే డెవలపర్లు, రియల్టర్లు, ఏజెంట్లు లేకపోలేరు. కొందరు ప్రభుత్వ పెద్దలు కూడా పరోక్షంగా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, రెరా రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం.. స్థానిక రెరా నుంచి అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు విక్రయించకూడదు. పదేళ్ల క్రితం నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో కొందరు డెవలపర్లు చేసిన మోసాల వల్ల అక్కడి సామాన్య కొనుగోలుదారులు దారుణంగా మోసపోయారు. మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇలా బూడిదపాలు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం రెరా నిబంధనలకు రూపకల్పన చేసింది. గతంలో ఢిల్లీలో జరిగిన మోసాలే మళ్లీ హైదరాబాద్లో ఈ యూడీఎస్ వల్ల జరిగే ప్రమాదముందని కొందరు బిల్డర్లు భయపడుతున్నారు. రెరా నుంచి అనుమతి లేకుండా ఫ్లాట్లను విక్రయించేసి.. ఒకవేళ ఆ బిల్డర్ అపార్టుమెంట్ పూర్తి చేయకపోతే? అందులో కొన్నవారి పరిస్థితి ఏమిటి? బిల్డర్ తో సహా యూడీఎస్ లో కొన్నవారూ ఆ మోసంలో పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి, యూడీఎస్ లో కొనకపోవడమే అన్నివిధాల మేలు అని అభిప్రాయపడే డెవలపర్లూ ఉన్నారు.

జాతీయ స్థాయిలో పరువు పోతుంది

హైదరాబాద్లో గత రెండేళ్ల నుంచి విచ్చలవిడిగా జరుగుతున్న యూడీఎస్ అమ్మకాల్ని చూసి జాతీయ నిర్మాణ రంగంలో చర్చ జరుగుతున్నది. ఈ మోసపూరిత విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందని కార్పొరేట్ నిర్మాణ సంస్థలన్నీ చర్చించుకుంటున్నాయి. హైదరాబాద్లో యూడీఎస్ అనే మోసపూరిత విధానంలో అమ్మకాలు జరుగుతున్నాయని.. అలా తాము చేయడం లేదని బెంగళూరు, చెన్నై, కోల్ కతాలకు చెందిన కొందరు బిల్డర్లు తమ కొనుగోలుదారులకు చెబుతుండటం గమనార్హం. హైదరాబాద్ నిర్మాణ రంగానికి చెందిన కొందరు డెవలపర్లు చేస్తున్న ఈ తప్పుడు విధానంతో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. కాబట్టి, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి యూడీఎస్ సేల్స్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధిక శాతం డెవలపర్లు కోరుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని అభ్యర్థిస్తున్నారు.

UDS SCHEME HOT TOPIC 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here