యూపీలో యోగీ షాకింగ్ నిర్ణయం ..

100
UP government
UP government

UP government starts process to seize property those protesters

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  చెప్పిందే చేస్తున్నారు . విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారుల ఆస్తులను జప్తు చేయడం ఆరంభించారు. ఈ మేరకు నోటీసులను పంపించారు. తొలిదశలో 14.87 లక్షల రూపాయల మేర నష్ట పరిహారాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. మొత్తం 28 మంది ఆందోళనకారులకు నోటీసులను జారీ చేశారు. నష్టాన్ని చెల్లించకపోతే.. ఆస్తులను జప్తు చేస్తామని ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు. రామ్ పూర్ జిల్లాలో తొలి నోటీసులను పంపించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ లో పెద్ద ఎత్తు ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనల సందర్భంగా రాజధాని లక్నో సహా బులంద్ షహర్, బహ్రెయిచ్, గౌతమబుద్ధ నగర్, ముజప్ఫర్ నగర్, ఘజియాబాద్, రామ్ పూర్ వంటి సుమారు 20 జిల్లాల్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైంది. పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టారు నిరసనకారులు. ఉత్తర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ ఆందోళనలు చెలరేగుతున్న సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తామని, వారికి త్వరలోనే నోటీసులను జారీ చేస్తామని అన్నారు. ఈ మేరకు లిఖిపూరక ఆదేశాలను సైతం రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ఇచ్చారు.అల్లర్లు కాస్త శాంతించగానే.. ఇక కార్యాచరణలోకి దిగారు యోగి ఆదిత్యానాథ్.

అల్లర్లకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. వారికి నోటీసులను జారీ చేశారు. తొలిదశలో 28 మంది ఆందోళనకారులకు స్థానిక మున్సిపల్, హోం మంత్రిత్వ శాఖ అధికారులు రికవరీ నోటీసులను పంపించారు. ఎందుకు నోటీసులను పంపించాల్సి వచ్చిందనే విషయాన్ని ఇందులో పొందుపరిచారు. రామ్ పూర్ జిల్లాలో తొలి నోటీసును పంపించారు స్థానిక అధికారులు. రామ్ పూర్ లోని నయీ బస్తీకి చెందిన ఎంబ్రాయిడరీ కార్మికుడిగా జమీర్ ఈ జప్తు నోటీసులను అందుకున్న వారిలో ఉన్నారు. ఆయనది పేద కుటుంబం. అయిదవ తరగతి వరకే చదువుకున్న జమీర్.. ఎంబ్రాయిడరీ కార్మికుడిగా స్థిరపడ్డారు. తన తల్లి మున్నీ బేగంతో కలిసి నయీ బస్తీలో నివసిస్తున్నారు. రామ్ పూర్ లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా జమీర్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడని అధికారులు గుర్తించారు. తమకు సౌకర్యాలను కల్పించాల్సిన ప్రభుత్వమే ఆస్తులను జప్తు చేస్తామని నోటీసులను జారీ చేసిందని జమీర్ తల్లి మున్నీ బేగం ఆరోపించారు. తన కుమారుడు ఎలాంటి ఆందోళనలకు పాల్పడ లేదని ఆమె చెబుతున్నారు. పొట్ట నింపుకోవడమే కష్టంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తాము లక్షల రూపాయల మేర రికవరీని ప్రభుత్వానికి ఎలా చెల్లించగలమని వాపోతున్నారు. రొక్కాడితే గానీ డొక్కాడదని, ఇప్పటికే జమీర్ ను అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here