Upper Backward Casts gets 10 Percent Reservation
- విద్య, ఉద్యోగాల్లో 10 శాతం కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- నేడు లోక్ సభలో బిల్లు
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రంలో మళ్లీ అధికారం దక్కించుకునేందుకు అధికార బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. ఇది చట్టరూపం దాలిస్తే బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు, అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు ఈ పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. దీంతో మొత్తం రిజర్వేషన్లు 59.5% అవుతాయి.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు విధించిన 50% గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ కోటా ప్రతిపాదిస్తున్నందువల్ల దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును.. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు చివరిరోజైన మంగళవారమే ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు పలకాల్సి ఉంటుంది. సమాజంలో ప్రభావవంతమైన వర్గానికి సంబంధించిన బిల్లు కాబట్టి రాజ్యసభలో కూడా ఇది సులభంగా ఆమోదం పొందుతుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయం ఎన్నికల జిమ్మిక్కు అంటూనే బిల్లుకు మద్దతిస్తాయని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. దీంతో బిల్లు సులభంగానే ఆమోదం పొందుతుంది. మొత్తమ్మీద గత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడం.. బీజేపీకి మొదటి నుంచి మద్దతుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు దూరం అవుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.