గ‌ర్భిణుల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావ‌మెంత‌?

  • టీకాలు తీసుకోవ‌డం మంచిదేనా..
  • పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు ప‌ట్ట‌గ‌ల‌మా
  • సందేహాలు నివృత్తిచేసిన కిమ్స్ వైద్యురాలు డాక్ట‌ర్ బిందుప్రియ‌

హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 11, 2022: ఎక్క‌డో బోట్స్‌వానా, ద‌క్షిణాఫ్రికాల‌లో గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. అమెరికా, యూకే లాంటి అగ్ర‌రాజ్యాల నుంచి భార‌త‌దేశం వ‌ర‌కు అన్నీ దీని తీవ్ర‌త‌కు అల్లాడుతున్నాయి. భార‌త‌దేశంలోనూ సోమ‌వారం ఉద‌యానికి 1.80 ల‌క్ష‌ల కొత్త కొవిడ్ కేసులు న‌మోదయ్యాయి. దీని వ్యాప్తిరేటు డెల్టా కంటే చాలా ఎక్కువ‌గా ఉంది. కేసులు రెట్టింపు కావ‌డానికి ప‌ట్టే స‌మ‌యం బాగా త‌గ్గుతోంది. ప్ర‌స్తుతానికి ఆస్ప‌త్రుల‌లో చేరిక‌లు, ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్ల అవ‌స‌రాలు అంత‌గా లేక‌పోయినా, సమీప భ‌విష్య‌త్తులో ఎలా ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. యూకేలో ఇప్ప‌టికే వైద్య‌రంగంలోకి సైన్యం సేవ‌ల‌నూ తీసుకోవాల్సి వ‌స్తోంది. క‌రోనా ఉధృతి, ఒమిక్రాన్ తీవ్ర‌త‌, గ‌ర్భిణుల‌పై అదిచూపే ప్ర‌భావం, వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి కిమ్స్ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ యూరోగైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ బిందుప్రియ ఇలా వివ‌రించారు.

ప్ర‌భావం ఎంత‌?
ప్ర‌స్తుతానికి గ‌ర్భిణుల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం ఎంత‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు. కొవిడ్‌లో ఇత‌ర వేరియంట్ల లాగే, ఇది కూడా ఉండొచ్చు. గ‌ర్భిణుల‌పై మ‌రీ అంత ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు గానీ, కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం వారికి తీవ్ర అనారోగ్యానికి దారితీసి త‌ల్లీబిడ్డ‌లిద్ద‌రికీ ముప్పు క‌లిగించే ప్ర‌మాద‌ముంది.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
ఇత‌రుల్లాగే గ‌ర్భిణులూ కొవిడ్ నుంచి త‌మ‌ను తాము కాపాడుకోడానికి కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవి:
1) ముక్కు, నోరు మూసి ఉంచేలా మాస్కు ధ‌రించండి.
2) చేతిశుభ్ర‌త పాటించండి – త‌ర‌చు మీ చేతుల‌ను స‌బ్బు లేదా ఆల్క‌హాల్ ఆధారిత శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకోండి.
3) క‌నీసం 2 అడుగుల భౌతిక దూరం పాటించండి – ర‌ద్దీ ప్ర‌దేశాల్లోకి వెళ్లొద్దు
4) అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు, ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు వాయిదా వేసుకుని, త‌గినంత గాలి, వెలుతురు త‌గిలేలా ఇంట్లోనే ఉండండి
5) ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు కొవిడ్ టీకా తీసుకోండి
6) పోష‌కాహారం, త‌గినంత నీరు తీసుకోండి

ల‌క్ష‌ణాలు ఇలా…
ఇత‌ర కొవిడ్ ల‌క్ష‌ణాల్లాగే జ్వ‌రం, జ‌లుబు, గొంతునొప్పి, ద‌గ్గు, ఊపిరి అంద‌క‌పోవ‌డం, త‌ల‌నొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచ‌నాలు, క‌డుపునొప్పి మ‌రేదైనా అనారోగ్యం ఉంటే వెంట‌నే మీ వైద్యుల‌ను సంప్ర‌దించండి.

గ‌ర్భానికి సంబంధించిన జాగ్ర‌త్త‌లు
ఆస్ప‌త్రికి వెళ్లేట‌ట్ల‌యితే అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇబ్బందులు అంత‌గా లేనివారైతే టెలిమెడిసిన్ సేవ‌ల‌నూ ఉప‌యోగించుకోవ‌చ్చు.

పాలిచ్చే త‌ల్లులు, శిశువుల‌పై ప్ర‌భావం
పిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లులు అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ పాలివ్వ‌డం కొన‌సాగించాలి. ప్ర‌స‌వానికి ముందు ఇంటికి ఎక్కువ‌మందిని రానివ్వ‌కండి. కేవ‌లం కుటుంబ‌స‌భ్యుల‌కే ప‌రిమితం కండి. ప్రస్తుత మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం పాజిటివ్ వ‌చ్చినా త‌ల్లులు పిల్ల‌ల‌కు పాలివ్వ‌వ‌చ్చు. త‌ల్లి పాల ద్వారా వైర‌స్ వ్యాపించ‌దు.

టీకాలు తీసుకోవ‌డం
గ‌ర్భిణులు టీకాలు తీసుకోవ‌డంపై అనేక అపోహ‌లు, దుర‌భిప్రాయాలు ఉన్నాయి. గ‌ర్భిణుల‌పై టీకాల‌కు సంబంధించిన ప్ర‌యోగాలు ఇంత‌వ‌రకు జ‌ర‌గ‌లేదు. కానీ, చాలా దేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు టీకాలు తీసుకున్న గ‌ర్భిణుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన ఇన్ఫెక్ష‌న్ బారి నుంచి గ‌ర్భిణుల‌ను ర‌క్షించ‌డానికి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఏకైక అస్త్రం టీకానే. పాలిచ్చే త‌ల్లుల‌కూ ఇది సుర‌క్షిత‌మేన‌ని వెల్ల‌డైంది.

కాబోయే త‌ల్లులు వైద్యుల స‌ల‌హాలు తీసుకుని, టీకాలు వేయించుకుని, కొవిడ్ జాగ్ర‌త్త‌ల‌న్నీ పాటిస్తూ సుర‌క్షితంగా ఉండాలి. ఒమిక్రాన్ గురించి భ‌యాల‌న్నీ వ‌దిలిపెట్టి ముందుకెళ్లండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article