VANDE BHARATH EXPRESS
- త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
దేశంలో తొలి ఇంజిన్ రహిత రైలుగా గుర్తింపు పొందిన ట్రైన్-18కి వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభిస్తారని తెలిపారు. ఢిల్లీ-వారణాసి మధ్య నడిచే ఈ రైలును పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, భారత్ లోనే తయారు చేశారు. ఈ రైలు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు. రూ.97 కోట్ల వ్యయంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని రూపొందించారు. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన శతాబ్ధి ఎక్స్ప్రెస్ వారసత్వానికి కొనసాగింపుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను తీసుకొచ్చారు. పూర్తి ఏసీ సదుపాయం కలిగిన ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయి. ఢిల్లీ-వారణాసి మధ్య కాన్పూర్, అలహాబాద్లలో మాత్రమే ఆగుతుంది. మొత్తం 755 కిలోమీటర్ల ప్రయాణాన్ని దాదాపు 8 గంటల్లో పూర్తిచేస్తుంది. శతాబ్దితో పోలిస్తే ఈ రైల్లో టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ తరగతి ధరలు రూ.2,800-2,900 మధ్య, చైర్ కార్ తరగతి ధరలు రూ.1,600-1,700 మధ్య ఉండొచ్చని పేర్కొన్నారు.