VANGAVEETI MAY JOIN IN TDP
- వైఎస్సార్ సీపీకి రాధాకృష్ణ రాజీనామా
- 24న తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం
- జనసేనలో చేరాలని అభిమానుల పట్టు
- రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానన్న వంగవీటి రాధా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ వైఎస్సార్ సీపీలో చిన్న కలకలం రేగింది. పార్టీ మార్పుపై గత కొంతకాలంగా తర్జనభర్జన పడుతున్న వంగవీటి రాధాకృష్ణ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ పంపారు. విజయవాడ సెంట్రల్ టికెట్ తనకు ఇవ్వనని వైఎస్సార్ సీపీ తన చేతలతో నిరూపించిన నేపథ్యంలో నాలుగు నెలలుగా మల్లగుల్లాలు పడుతున్న రాధా.. చివరకు పార్టీ వీడారు. ఈ సందర్భంగా జగన్ కు పంపించిన రాజీనామా లేఖలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం కావాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలంటే పార్టీ నేతలపై ఆంక్షలు విధించడం తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం అవసరం. అందుకే వైఎస్సార్ సీపీకి రాజీనామా చేస్తున్నాను అని జగన్ ను ఉద్దేశించి రాధా పేర్కొన్నారు.
వాస్తవానికి పార్టీ వీడే విషయంపై రాధా గత నాలుగు నెలలుగా తర్జనభర్జన పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వడంలేదనే విషయాన్ని పార్టీ అధిష్టానం ఆయనకు స్పష్టంచేసినప్పుడే రాధా సందిగ్ధంలో పడ్డారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ సమన్వకర్తగా మల్లాది విష్ణును నియమించడంతో ఇక పార్టీ మారడం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. అయినా ఆయన వేచిచూసే ధోరణి అవలంభించారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తామని రాధాకు ఆఫర్ చేశారు. అయితే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను బాలశౌరికి అప్పగించడంతో రాధా గందరగోళంలో పడ్డారు. తనను పొమ్మనకుండా పొగబెట్టే రీతిలో పార్టీలో పరిణామాలు జరగడంపై రాధా కినుక వహించారు. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కావాలని పలుమార్లు స్పష్టంచేశారు. అయినప్పటికీ, ఎలాంటి హామీ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. అయితే, వంగవీటి రాధా ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన అభిమానులు జనసేనలో చేరాలని సూచిస్తుండగా.. తెలుగుదేశం పార్టీలో చేరితో భవిష్యత్తు బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నట్టు తెలిసింది. టీడీపీ కూడా రాధాను పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈనెల 24న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. కాగా, అభిమానులు, అనుచరులతో మాట్లాడి రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని రాధా ప్రకటించారు.