రాధాలో అంతర్మథనం

VANGAVEETI RADHA RETHINKING

  • టీడీపీలోనూ కోరిన సీటు దక్కే అవకాశం లేదు
  • ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ?

వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీలో చేరే ఉద్దేశంతోనే ఆయన జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే, తన తండ్రిని చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలో చేరితే అభిమానుల స్పందన ఎలా ఉంటుందో అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పలు మార్గాల ద్వారా వారి నాడి తెలుసుకునే యత్నం చేశారు. అక్కడ మిశ్రమ స్పందన వ్యక్తమైనట్టు సమాచారం. పైగా తెలుగుదేశంలోనూ ఆయన ఆశించిన విజయవాడ సెంట్రల్ సీటు దక్కే అవకాశం లేదు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకే మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాలోని ఇతర స్థానాల్లో కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా అక్కడ సీటు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఒకవేళ సీటు వచ్చి, టీడీపీ నుంచి పోటీకి దిగితే అన్ని వర్గాలూ కలిసి వస్తాయో లేదో అన్నదీ అనుమానంగా ఉందని అంటున్నారు.

మరోవైపు వంగవీటి రాధా పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ అదేగానీ నిజమైతే ఎమ్మెల్సీ పదవి కోసం రాధా పార్టీ మారడం అవసరమా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారో.. లేదో సందేహమే. టీడీపీ మళ్లీ గెలిచి వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నా దేవినేని కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పని పరిస్థితి. వైఎస్సార్ సీపీలో ఉండి ఉంటే ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే పదవి దక్కేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాధా టీడీపీలో చేరే విషయంలో డైలమాలో పడినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article