40 villages are fighting for schemes on Maharashtra
గులాబీ బాస్ కేసీఆర్ వల్ల మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తెలంగాణా రాష్ట్రానికి ఆనుకుని ఉన్న సరిహద్దు గ్రామాలు మేము మహారాష్ట్రలో ఉండము అని చెప్తున్నాయి. తెలంగాణాకే పోతామని అంటున్నాయి.కేవలం కేసీఆర్ అందిస్తున్న పథకాలు చూసి ఆకర్షితులవుతున్న మహారాష్ట్ర సరిహద్దులో వున్న దాదాపు 40 గ్రామాల్లోని ప్రజలు మహారాష్ట్రను వీడతామని, మమ్మల్ని వదిలేయండని ఆందోళన బాటపట్టారు. ఇక ఎవరూ ఊహించని పరిణామంగా ఉన్నట్టుండి 40 సరిహద్దు గ్రామాలు ఆందోళనకు దిగడం మహరాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అసలు 40 గ్రామాల ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు. మహారాష్ట్రను ఎందుకు వీడాలనుకుంటున్నారని ఆరాతీస్తే దానికి ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేలింది. ఆయన అందిస్తున్న స్కీమ్స్ అని తేలింది.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో పక్క రాష్ట్రాలకు తలనొప్పులు ఎదురు అవుతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ , పంట భీమా, రైతు బంధు ద్వారా పెట్టుబడి , ఇంకా కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు తమకు కూడా కావాలని ఆందోళన బాట పట్టాయి మహారాష్ట్రలోని 40 గ్రామాలు .
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు భీమా, పంట పెట్టుబడి, కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు అందజేస్తుండం వంటి పథకాలు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు అమితంగా నచ్చాయట. ఇవన్నింటిలో ఏ ఒక్క పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 40 గ్రామాలని విలీనం చేయాలని, ధర్మాబాద్ పంచాయితీ కార్యాలయం ఎదుట 40 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ఆందోళన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ, శివసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరగడం విశేషం. చాలా ఆసక్తిని కలిగిస్తున్న ఈ గ్రామాల ప్రజల తీరు చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుంటే మూటాముల్లె సర్దుకుని తెలంగాణా కు వచ్చి నివసించేలా ఉన్నారు.