VIRAT KOHLI GOT THREE AWARDS
- ఐసీసీ మూడు పురస్కారాలకు ఎంపిక
భారత పరుగుల యంత్రం, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా కూడా తిరుగులేని రికార్డులతో దూసుకువెళ్తున్న విరాట్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మూడు ప్రధాన అవార్డులకు ఎంపిక చేసింది. అన్ని ఫార్మాట్‌లలో సత్తా చాటిన కోహ్లీని ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)గా వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు. ఈ అవార్డును రెండోసారి గెలుచుకున్న భారత క్రికెటర్ కోహ్లీయే కావడం విశేషం. గతంలో రాహుల్ ద్రవిడ్(2004), సచిన్(2010), అశ్విన్(2016)లో ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు. టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులనూ కోహ్లీయే కైవసం చేసుకున్నాడు. ఐసీసీ చరిత్రలో ఒకే ఏడాది మూడు ప్రధాన అవార్డులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఇక ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ద ఇయర్, వన్డే టీమ్ ద ఇయర్‌లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కోహ్లి నాయకత్వంలో 2018లో భారత్ 6 టెస్టుల్లో గెలిచింది. 7 టెస్టుల్లో ఓడింది. వన్డేల్లో 9 విజయాలు నమోదు చేసింది. 4 పరాజయాలు చవిచూసింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
ఇక టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. ఐసీసీ టెస్టు జట్టు కీపర్‌గానూ పంత్ ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు స్థానం లభించింది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, కుల్దీప్‌లకు అవకాశం దక్కింది. ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్ జింబాబ్వేతో జరిగిన టీ20లో చేసిన సెంచరీ (72 బంతుల్లో 172 పరుగులు) అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచింది. స్కాట్లాండ్ ఆటగాడు కాలమ్ మెక్లాయిడ్ ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. ‘స్పిరిట్ ఆఫ్ ద ఇయర్’ను విలియమ్సన్ (న్యూజి లాండ్) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్‌గా నిలిచాడు.