విశాఖ టీడీపీ కార్యాలయం కూల్చివేత

Visaka TDP Building Demolishing

ఏపీలో అక్రమ నిర్మాణాలకు నోటీసుల పర్వం కొనసాగుతోంది. నిన్నటివరకు విజయవాడలోని కరకట్ట ఆక్రమణలకు నోటీసులు జారీకాగా… తాజాగా అది సాగర తీరానికి పాకింది. విశాఖలోని టీడీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం(జూన్ 30,2019) కూల్చివేత నోటీసులు జారీ చేశారు.నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారంటూ అధికారులు నోటీసులిచ్చారు. భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, యాజమాన్య పత్రాలను సమర్పించలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో మళ్లీ నోటీసులిచ్చామన్నారు. మరోవైపు… ప్రభుత్వ స్థలంలో టీడీపీ ఆఫీస్ నిర్మించారనే ఆరోపణలతో.. జీవీఎంసీ నోటీసులివ్వడం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల్లో స్పందించకపోతే భవనాన్ని కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సీఎం జగన్.. రాష్ట్రంలో అక్రమకట్టడాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా కృష్ణా నది కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చేశారు. ప్రజావేదికతో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం సహా 20 అక్రమకట్టడాలకు సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ఇంటి వేటలో పడ్డారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. కాగా, ప్రభుత్వం చర్యలు చంద్రబాబుపై కక్ష సాధింపే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article