VISWADARSANAM TEASER RELEASE
- విశ్వనాథ్ ‘విశ్వదర్శనం’ టీజర్ విడుదల
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ జీవితగాథ ఆధారంగా జనార్థన మహర్షి తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వ దర్శనం’. ఈ సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. ‘వందేళ్ల వెండితెర చెబుతున్న 90 ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అన్న డైలాగ్‌తో టీజర్ మొదలైంది. రాధిక, శరత్‌కుమార్, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్ తదితరులు విశ్వనాథ్ గొప్పతనం చెబుతున్న అంశాలను టీజర్ లో పొందుపరిచారు. విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను టీజర్‌లో చూపించారు.
టీజర్ విడుదల సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘నాకు నేను చాలా గొప్పవాణ్ని, నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే విశ్వదర్శనం. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షే. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లు చేస్తున్న ఈ టీజర్ రిలీజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు. దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ.. ‘మా అమ్మగారు విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆయన తీసిన సినిమాల్లోని కథలను మా అమ్మ చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచీ విశ్వనాథ్‌గారు డైరెక్టర్‌కాదు, హీరో. వెండితెరపై ఎందరో మహానుభావులు కథలు తీశారు. ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నా’ అని తెలిపారు.