Value OF vote .. ఆ ఒక్క ఓటు అభ్యర్థిదే
ఎవరికి వారు నేను ఒక్కడిని ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏమి లేదు అని భావిస్తారు. కానీ ఒక్క ఓటు కూడా విలువైనదే. అది పోటీ చేసిన నాయకుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేదే. ఓటు చాలా శక్తివంతమైనది. మన తలరాతల్ని మార్చే బ్రహ్మాస్త్రమది. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే.. అని ఎవరెంత చెప్పినా అర్థం చేసుకోలేని వారికి ఈ కథనం ఒక్క ఓటు ఎంత విలువైందో అర్థమయ్యేలా చెప్తుంది.
దేశ గతిని మార్చే ప్రధాని మంత్రి ఎన్నికలైనా..గ్రామ స్వరూపాన్ని మార్చే సర్పంచ్ ఎన్నికలైనా..! ఒక్క ఓటుతో అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఒకే ఒక్క ఓటుతో అధికార పీఠంపై కూర్చున్న వాళ్లూ ఉన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో ఇలాంటి చిత్రవిచిత్రాలు చాలానే చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటుతో సర్పంచ్ పదవిని కోల్పోయి ఆగం అయ్యారు ఓ ఆగం రెడ్డి . ఇక ఒక్క ఓటు ఎవరిది అంటే అది అసలైన ట్విస్ట్… ప్రచారంలో పడి తమ ఓట్లు తామే వేసుకోవడం మరిచిపోయారు ఆగం రెడ్డి దంపతులు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రంగాపురం గ్రామంలో మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ బరిలో నిలిచారు. ఐతే ఒకే ఒక్క ఓటు తేడాతో రామిడి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మర్రి ఆగంరెడ్డి ఓడిపోయారు. ఐతే మర్రి ఆగంరెడ్డి దంపతులు మధ్యాహ్నం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అందరి దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. తమకే ఓటు వేయాలంటూ వారినీ వీరినీ అడిగారు తప్ప సొంత ఓటు వేసుకోలేదు. ప్రచారంలో పడి ఓటు వేయడం మర్చిపోయారు. వాళ్లిద్దరు ఓటు వేసినట్లయితే ఒక్క ఓటు మెజార్టీతో ఆగం రెడ్డి గెలిచేవారు. కానీ దురదృష్టం వెక్కిరించింది. సొంత ఓటును నిర్లక్ష్యం చేయడంతో ఎన్నికల్లో ఓడిపోయారు ఆగం రెడ్డి. ఇది ఓటు కున్న విలువ. ఆ ఒక్క ఓటు ఆగం రెడ్డి కి పడి ఉంటే ఇలా ఆగం కాకుండా సర్పంచ్ అయ్యేవాడు ప్రచారం మీద దృష్టి పెట్టిన ఆయన తన ఓటు తానే వేసుకోవడం మర్చిపోవడం వల్ల చేజేతులారా సర్పంచ్ పదవి పోయింది. ఇక ఆగం రెడ్డి కి సంబంధించిన ఈ కథలో నీతి ఏంటి అంటే ఒక్క ఓట్ అయినా విలువైనదే.