Monday, May 12, 2025

పోరుకు సిద్ధం ఉదయం 7 గంటలకు మొదలు

  • పోరుకు సిద్ధం
  • ఉదయం 7 గంటలకు మొదలు
  • అంతకు ముందే మాక్​ పోలింగ్​
  • తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ
  • ఖాళీ అయిన భాగ్యనగరం

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల సమరం ఆసన్నమైంది. సోమవారం ఏపీ అసెంబ్లీ, లోక్​సభ, తెలంగాణ లోక్‌సభ పోలింగ్‌కి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో ఉదయం నుంచి సామగ్రిని తీసుకుని.. పోలింగ్​ కేంద్రాలకు బయలుదేరారు. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసు బలగాలు తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నాయి. పోలీస్‌, ఎన్నికల అధికారులు సమన్వయం చేసుకొని ఓటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షిస్తున్నారు. ఈవీఎంల తరలింపు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. సార్వత్రిక సమరంలో కీలకఘట్టమైన పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈసీ నిర్దేశించిన మేరకు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తికాగా తమకు కేటాయించిన సెంటర్‌లకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకున్నారు.

ప్రక్రియ పూర్తి

పోలింగ్​ కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సీసీ కెమెరాల నిఘానీడలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశారు.
దేశంలోని అతిపెద్ద సెగ్మెంట్​ అయిన మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 37లక్షల 80వేల మంది ఓటర్లుండగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌ కోసం 3వేల 228 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 డీఆర్సీల వద్ద ఈవీఎంలు, వీవి ప్యాట్‌లను అధికారులు స్ట్రాంగ్ రూంలలో సిద్ధంగా ఉంచారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గపరిధిలో మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ర్యాండామైజేషన్ ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించి స్ట్రాంగ్‌ రూంలలో భద్రపర్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, వరంగల్‌ లోక్‌సభ స్థానాలకు జరిగే పోలింగ్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ సిబ్బందికి మధ్యాహ్నం ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో దిగగా 1900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 247 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించగా నగర కమిషనరేట్ పరిధిలో 7 కేంద్ర బలగాలు సహా ఐదు వేలమంది పోలీస్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి 23 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 1809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 335 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించిన పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయినందున రేపు సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో 61 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు. పోలింగ్ నిర్వ

హణకి అధికారులు ఏర్పాట్లు చేయగా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల వేళ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. గత ఎన్నికల్లో వివిధ చోట్ల నమోదైన పోలింగ్‌ శాతంతో పాటు జరిగిన గొడవలు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిజామాబాద్‌ లోక్‌సభ పోలింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ పరిధిలో రెండు జిల్లాలు, 7 నియోజకవర్గాలుండగా 1808 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 17లక్షల 4వేల 867 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించగా జిల్లాలో 1772 మంది ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభకు పోటీలో 29 మంది అభ్యర్థులు ఉన్నందున పోలింగ్ కోసం రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. ఎండవేడిమి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.

ప్రలోభాలపై గురి

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడగా.. ఆదివారం అంతా సైలెంట్​ గా ఉంది. సోమవారం ఉదయాన్నే పోలింగ్ మొదలుకానున్నది. అయితే, కొన్ని సెగ్మెంట్లలో నోట్ల కట్టలకు పని పడింది. ప్రలోభాల పర్వం ఆదివారం అర్థరాత్రి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రతిసారీ ఎన్నికలు గతంకంటే కాస్ట్ లీ గా మారుతున్నాయి. అటు ప్రచారం ఖర్చు కూడా పెరిగింది, ఇటు ప్రలోభాలకు కేటాయించాల్సిన ఖర్చు కూడా పెరిగినట్టే చెప్పుకోవాలి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఈసీ గట్టి నిఘా పెట్టడంతో నేరుగా చేతిలోనే డబ్బు పెట్టి తమ పార్టీకి ఓటు వేయాలని ఒట్టు పెట్టించుకుంటున్నారు. గతంలో ఒక పార్టీ దగ్గర డబ్బు తీసుకున్నారని తెలిస్తే, ఇంకో పార్టీ వారు జోలికి వచ్చేవారు కాదు. కానీ రాను రాను అందరి వద్దా డబ్బులు తీసుకోవడం, అందులో నచ్చినవారికి ఓటు వేయడం.. అనేది రివాజుగా మారింది. నిజాయితీపరులైన ఓటర్లు ఉన్నా కూడా డబ్బులు డిమాండ్ చేసి మరీ ఓటు వేస్తామనేవారికి కూడా కొదవలేకుండా పోయింది.

ఏపీలో వలస ఓటర్ల కోసం

ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు కలిపి ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలోని అత్యంత సమస్యత్మాక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే మైకులు మూగబోయాయి. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం ఆగిపోయింది. సాధారణ నియోజకవర్గాల్లో మే-13 ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్​ నుంచి ఏపీకి ఓటర్లను చేరవేసేందుకు ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేశారు. వరుసగా సెలవులు రావడంతో.. ఓటర్లు కూడా సొంతూళ్లకు వెళ్లారు. సోమవారం ఓటేసిన తర్వాత మళ్లీ వారందరినీ హైదరాబాద్​కు తరలించనున్నారు.

ఏపీలో అసెంబ్లీ పోలింగ్​ కూడా ఉండటంతో.. ఓటర్లకు భారీ డిమాండ్​ నెలకొన్నది. ఇప్పటికే 70 శాతం మంది ఏపీ ఓటర్లు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో నివశిస్తూ ఏపీలో ఓట్లు ఉన్న చాలామంది సొంత ఊళ్లకు ప్రయాణం కట్టారు. శని, ఆది వారాలు వరుస సెలవలు కావడం, ఆ తర్వాత సోమవారం ఓట్ల పండగ ఉండటంతో.. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శనివారం, ఆదివారం తెల్లవారు ఝామున కూడా హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే రోడ్లు రద్దీగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సాధికారిక గణాంకాలు లేకపోయినా తెలంగాణలో ఉన్న చాలామందికి ఏపీలో ఓట్లు ఉన్నాయి. అటు బెంగళూరు నుంచి కూడా చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏపీలోని సొంత ఊళ్లకు వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. ఈసారి విదేశాలనుంచి కూడా చాలమంది ఎన్నికల సీజన్ లో ఏపీకి వచ్చినట్టు తెలుస్తోంది. వలస ఓటర్లు కొందరు స్వచ్ఛందంగా వస్తున్నా, మరికొందర్ని తరలించేందురు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేశాయి, ముందుగానే తాయిలాలు ముట్టజెప్పాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్‌ నుంచి 500, జేబీఎస్‌ నుంచి 200, ఉప్పల్‌ నుంచి 300, ఎల్బీనగర్‌ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్లు కూడా కిక్కిరిసి కనపడుతున్నాయి.

హైదరాబాద్ నుంచి ఏపీ పల్లెలకు వలస ఓటరు తీర్పివ్వడానికి బయలుదేరాడు. లాభం ఎవరికి..? వలస ఓటరు ఎటువైపు అని అంచనా వేయడం కష్టంగానే మారింది. ఏ ప్రాంతంలో ఉన్నా.. స్థానికంగా ఉన్న పరిస్థితులను వలస ఓటరు ఓ కంట కనిపెడుతుంటాడు.ఈసారి వలస ఓట్లు ఏ పార్టీకి అనేది మాత్రం పోలింగ్ రోజే క్లారిటీ వస్తుంది.

కూల్​ వెదర్​

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగినన్ని రోజులు ఉష్ణోగ్రతలు దడ పుట్టించినా.. ప్రచారం ముగిసిన తర్వాత వాతావరణం కూడా చల్లబడింది. పోలింగ్ రోజు కూడా వాతావరణం చల్లగానే ఉండే అవకాశముంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com