VV VINAYAK MAY JOIN YCP
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన చర్యలు చూస్తుంటే అధికార వైఎస్సార్ సీపీ వైపు ఆయన చూస్తున్నట్టు అర్థమవుతోంది. అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’కు దర్శకత్వం వహించిన వినాయక్.. ఆ సినిమా ఫెయిల్ కావడంతో వెనకబడ్డారు. అనంతరం రెండేళ్ల తర్వాత చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్-150తో హిట్ కొట్టినా, అది రీమేక్ కావడంతో వినాయక్ కు క్రెడిట్ దక్కలేదు. గతేడాది సాయిధర్మతేజ్ నటించిన ఇంటెలిజెంట్ సినిమాకు దర్శకత్వం వహించారు. అది కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో దర్శకుడిగా ఉన్న ఆయన నటన వైపు దృష్టి పెట్టి ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్నది వినాయక్ ఆలోచనగా తెలుస్తోంది.
కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినాయక్ అందరి దృష్టీ ఆకర్షించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు స్ఫూర్తిదాయకుడని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు చక్కని అనుబంధం ఉందని గతంలోనే ఓసారి స్పష్టంచేసిన వినాయక్.. గత ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా అప్పుడు కుదర్లేదని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయాలని భావించారని, కానీ కొన్ని కారణాలరీత్యా అది జరగలేదని అంటున్నారు. అయితే, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ రాజకీయాల వైపు వినాయక్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన వైఎస్సార్ సీపీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.