Tuesday, November 19, 2024

వైన్‌షాపులకు ఇచ్చిన పర్మిట్ రూమ్‌లతో ఇబ్బందులు పడుతున్నాం

  • మా వ్యాపారం తగ్గిపోతుంది
  • పర్మిట్ రూంలలో ఎలాంటి తినుబండరాలు, బెంచీలు, కుర్చీలు లేకుండా చూడాలి
  • నూతన ఎక్సైజ్ పాలసీ విషయంలో బార్‌లకు ఇబ్బందులకు కలగకుండా చూడాలి
  • ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బార్‌ల సంఘం యజమానుల ఫిర్యాదు

వైన్‌షాపులకు ఇచ్చిన పర్మిట్ రూమ్‌లతో తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ వ్యాపారం తగ్గిపోతుందని బార్‌ల సంఘం యజమానులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పేర్కొన్నారు. నూతన పాలసీ విషయంలో ఎలాంటి నిబంధనలు విధిస్తున్నారో ముందస్తుగా బార్‌ల యజమానులకు తెలియచేయాలని వారు మంత్రికి విన్నవించారు. బార్‌ల సంఘం యజమానులతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం నిర్వహించారు. వారం క్రితం తమ సమస్యలను పరిష్కరించాలని బార్‌ల సంఘం యజమానులు మంత్రి జూపల్లికి చేసిన విన్నపం నేపథ్యంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ శ్రీధర్‌లతో ఈ సమావేశం జరిపారు.

ఈ సందర్భంగా పలు సమస్యలను బార్‌ల సంఘం యజమానులు మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా బార్‌ల సంఘం యజమానులు మాట్లాడుతూ అన్ని జిల్లాలోనూ వైన్‌షాపులను రాత్రి 10 గంటల వరకు, హైదరాబాద్ పరిధిలో రాత్రి 11 గంటల వరకు నడుపుకునేలా గతంలో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనివల్ల బార్‌లకు నష్టం వాటిల్లుతుందని, హైదరాబాద్‌లోనూ 10 గంటల వరకే వైన్‌షాపులను మూసివేసేలా ఆదేశాలు జారీ చేయాలని వారు మంత్రికి విన్నవించారు.

నిబంధనలను వైన్‌షాపుల యజమానులు పట్టించుకోవడం లేదు
వైన్‌షాపుల పర్మిట్ రూంలకు సంబంధించి జిఓ 25, 26లకు అనుగుణంగా నిబంధనలను వైన్‌షాపు యజమానులు పాటించడం లేదని బార్‌ల యజమానులు మంత్రికి ఫిర్యాదు చేశారు. పర్మిట్ రూంలలో ఎలాంటి తినుబండరాలు, బెంచీలు, కుర్చీలు లేకుండా ఉండాలన్న నిబంధనలను సైతం వైన్‌షాపు యజమానులు పట్టించుకోవడం లేదని దీనివల్ల బార్లకు ఆదాయం పడిపోతుందని ఈ విషయంలోనూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని వారు విన్నవించారు.

దీంతోపాటు తమను డబ్బుల కోసం పలు జిల్లాల అధికారులు వేధిస్తున్నారని, రెన్యువల్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు. బార్‌ల సంఘం యజమానులు సూచించిన పలు సమస్యలపై దృష్టి సారిస్తామని త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారుల నుంచి వేధింపులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి బార్‌ల సంఘం యజమానులకు హామీనిచ్చారు. ఈ సమావేశంలో బార్‌ల సంఘం యజమానుల సంఘం బాల్‌రాజ్‌గౌడ్, జి.దామోదర్ గౌడ్, రామకృష్ణ, రాజుగౌడ్, నరసింహ గౌడ్, వెంకన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పల్లె నర్సింగ్ రావు, నిరంజన్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular