కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మావోయిస్టు పార్టీ
చర్చల కోసం కమిటీ ఏర్పాటు..
కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఆ లేఖను పంపారు. చర్చలకు సంబంధించిన కమిటీని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈనెల 3న భారత మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేశారు.. ఈ క్రమంలో కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా – మావోయిస్టు పార్టీ మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం జోక్యం చేసుకోవాలని పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్ర కుమార్ ఆదివారం ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా మాజీ జస్టిస్ చంద్ర కుమార్ ఉపాధ్యక్షుడిగా జంపన్న అలియాస్ నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్ హరగోపాల్, కన్వీనర్ గా దుర్గాప్రసాద్, కో-కన్వీనర్లుగా జయ వింధ్యాల, డాక్టర్ తిరుపతయ్య, బాలకిషన్ రావు, కందుల ప్రతాప్ రెడ్డి కమిటీలు ఉన్నారు. ఈ సమాచారం కమిటీ సభ్యులు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
మావోయిస్టుల లేఖలో ఏముంది?
శాంతి చర్చల స్థాపన కోసం పీస్ డైలాగ్ కమిటీ ఏర్పాటు అయింది. ఇరు పక్షాల మధ్య శాంతియుత చర్చలను సులభతరం చేయడం కోసం, కాల్పుల విరమణను ప్రోత్సహించడం, హింసను అంతం చేయడానికి స్థిరమైన పరిష్కారాలను కనుక్కోవడం, ఇరు పక్షాలకు సూచనలు చేయడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీలో సమాజంలోని వివిధ వర్గాల నుంచి న్యాయ కోవిదులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు , మానవ హక్కుల నిపుణులు, జర్నలిస్టులు, ప్రజా నాయకులు భాగస్వాములుగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు పార్టీ సాయుధులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలకు మధ్య జరుగుతున్న హింసా విధానాలకు సామాన్య ప్రజలు, ఆదివాసీలు జీవించే హక్కును కోల్పోతున్నారు. నిత్యం ఆయా ప్రాంతాలలో నెత్తుటి మధ్యలోనే ప్రజలు జీవిస్తున్నారని పత్రికలలో వొస్తున్న వార్తలు చూసి మేము కలవరపడుతున్నామని లేఖలో పేర్కొన్నారు.
ఇద్దరి హింసా విధానాల ఫలితంగా మహిళలు, పిల్లలు, యువత భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాలు, గూడేలు వదిలి తరలివెళుతున్నారని వార్తలు వొస్తున్నాయి. ప్రభుత్వాలు, రాజ్యంగంలో చెప్పిన విధంగా సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసేందుకు సరైన వాతావరణం రోజురోజుకూ క్షిణిస్తోందని ఆందోళన చెందుతున్నాం. మావోయిస్టు పార్టీ గెరిల్లాలు, ప్రభుత్వ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణను నివారించడానికి కాల్పుల విరమణ – శాంతి చర్చలు ఒక్కటే మార్గం అని ప్రజాస్వామిక వాదులంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇరు పక్షాల మధ్య జరుగుతున్న ఈ సాయుధ సంఘర్షణ దేశంలోని అనేక ప్రాంతాలలో అశాంతి, ప్రాణనష్టానికి కారణమవుతోంది. మహిళలు మానభంగాలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు తల్లి తండ్రులను కోల్పోతున్నారు, గిరిజన సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దఎత్తున మానవ హక్కులకు విఘూతం కలుగుతోంది. ఈ హింసా విధానాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తూ, అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది. ఇటీవల తాజా పరిణామాలు చూసి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని లేఖలో పొందుపరిచారు. ఐదు రాష్ట్రాల పరిధిలో ప్రజలు నిరంతరం రక్తపాతం మధ్య జీవిస్తున్నారనే వార్తలతో కలవరపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వైపులా హింసాత్మక చర్యలతో మహిళలు, పిల్లలు, యువత భయంతో జీవిస్తున్నారని చాలా మంది నిర్వాసితులు అవుతున్నారని నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయని అన్నారు.
భారత రాజ్యాంగం ఊహించిన సంక్షేమ రాజ్య స్థాపన కోసం, దేశంలో పెరుగుతున్న హింస, దాని పర్యవసానాలు, పరిస్థితులను పరిష్కరించడానికి మీ తక్షణ జోక్యం అవసరమని మేం అభ్యర్థిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. శాంతి సంభాషణల కమిటీ దేశం యొక్క భవిష్యత్ కు మీ తక్షణ జోక్యం అవసరమని మీరు పరిగణించాలని, ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండేందుకు, శాంతి చర్చల మార్గంలోకి రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.