Wednesday, September 18, 2024

15 రోజుల్లో డీఎస్సీ 2008 నియామ‌కాలు పూర్తి చేస్తాం

డీఎస్సీ 2008 బాధితుల నియమకాలను 15 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని 2008 డీఎస్సీ బాధితులు సోమ‌వారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి త‌ర‌లివ‌చ్చారు. డీఎస్సీ-2008 సాధ‌న స‌మితి నేతృత్వంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 200 మందికి పైగా అభ్య‌ర్థులు సీఎం ఇంటి దగ్గరకు వ‌చ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. సీఎం ఆదేశం మేరకు.. ఆరుగురిని ముఖ్యమంత్రి నివాసంలోకి పంపించారు. సీఎం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి జైపాల్ రెడ్డి వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా బాధితులు మాట్లాడుతూ డీఎస్సీ 2008 బాధితుల‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని హైకోర్టు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 8న మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని చెప్పారు. ఈ మేర‌కు ఈ ఏడాది మార్చి 14న జ‌రిగిన రాష్ట్ర మంత్రివర్గ స‌మావేశంలో డీఎస్సీ 2008 బాధితుల‌కు ఆంధ్రప్రదేశ్ త‌ర‌హాలో ఉద్యోగాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని తెలిపారు. ఇందుకు సంబందించిన విధివిధానాల ఖ‌రారు చేసే బాధ్య‌త‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలోని క్యాబినెట్ స‌బ్ క‌మిటీకి అప్ప‌గించింద‌ని డీఎస్సీ 2008 బాధితుల‌ు గుర్తు చేశారు. ఐతే ఇప్ప‌టికి ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఇంకా త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని వాపోయారు.

ఈ నెల 27వ తేదీ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని, చివ‌రి అవ‌కాశం ఇవ్వాలని తెలంగాణ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ హైకోర్టు ధ‌ర్మాస‌నానికి తెలిపార‌ని చెప్పారు. ఈ గ‌డువు మంగ‌ళ‌వారంతో ముగ‌స్తున్న‌ద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. 15 సంవ‌త్స‌రాల త‌మ ఎదురుచూపుల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం తెర‌దించింద‌ని, త‌మ‌కు ఉద్యోగాలు కూడా ఇచ్చి ఆదుకోవాల‌ని డీఎస్సీ 2008 బాధితులలు విజ్ఞ‌ప్తి చేశారు. వారి అభ్యర్ధన మేరకు ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశంతో మాట్లాడి వివ‌రాల‌ను సేక‌రించారు. సంబంధిత ఇత‌ర అధికారుల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రిపారు. వచ్చే వారం రోజుల్లో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ నుంచి నివేదిక తీసుకొని, ఆ తరువాత 15 రోజుల్లో డీఎస్సీ 2008 బాధితుల నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని ముఖ్యమంత్రి కార్యాల‌య అధికారులు హామీ ఇచ్చిన‌ట్టు డీఎస్సీ 2008 సాధ‌న స‌మితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాట్ శ్రీనివాస్ నాయక్ చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular