ఆ సినిమా వెనుక ‘అసలేం జరిగింది?’

53
TS News special interview with Asalem Jarigindhi producer King Johnson
TS News special interview with Asalem Jarigindhi producer King Johnson

శ్రీరామ్ హీరోగా ఎన్వీఆర్ దర్శకత్వంలో కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన చిత్రం ‘అసలేం జరిగింది?’. తెలంగాణలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్లలో నిలదొక్కుకోవడం అంటే అషామాషీ కాదు. అలాంటిది అసలేం జరిగింది సినిమా నాలుగు వారాలుగా ఆడుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తన తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కింగ్ జాన్సన్ ను టీఎస్ న్యూస్ పలకరించింది. పాత్రికేయుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన.. సినిమాలవైపు ఎలా వచ్చారు? ఈ చిత్రం తీయడానికి ముందు, తీసిన తర్వాత అసలేం జరిగిందో టీఎస్ న్యూస్ తో పంచుకున్నారు. ఇకపై ఏడాదికి మూడు సినిమాలు తీయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
‘నేను చదువుకునేటప్పుడు కొన్ని సినిమా షూటింగులు చూశాను. ఆ తర్వాత ఆ సినిమాలను వెండితెరపై చూసినప్పుడు భలే థ్రిల్ ఫీలయ్యేవాడిని. పైగా సినిమాలు ప్రజలపై బాగా ప్రభావం చూపిస్తాయి. దీంతో క్రమంగా సినిమాలపై నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఇక నా తొలి సినిమాకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఒక సినిమా తీయాలంటే చాలా డబ్బు కావాలి. కానీ సినిమాలపై నాకున్న ఆసక్తి కారణంగా రిస్క్ చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఉన్నదంతా పెట్టి ‘అసలేం జరిగింది’ సినిమా తీశాను. కాలేజీ రోజుల్లో నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడుగారితో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేయడం నాకు ఇక్కడ కలిసి వచ్చింది’ అని జాన్సన్ వివరించారు. అసలేం జరిగింది చిత్రం ఎలా మొదలైంది అని అడగ్గా.. డైరక్టర్ రాఘవ తనకు స్టోరీ లైన్ చెప్పినప్పుడు నచ్చిందని, ప్రేక్షకులకు కూడా నచ్చితే తప్పకుండా హిట్ అవుతుందని భావించామని పేర్కొన్నారు. అయితే, వ్యాపారపరమైన కోణంలో సమస్య రాకుండా ఉండేందుకు తమిళం నుంచి హీరో శ్రీరామ్ ను, కన్నడ నుంచి హీరోయిన్ సంచితా పదుకోన్ ను తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. అయితే తమది తప్పుడు నిర్ణయమని తర్వాత తెలిసిందని చెప్పారు.

సినిమా ప్రయాణం ఎలా మొదలైందో వివరిస్తూ.. ‘పూర్తిగా ప్రొఫెషనల్ తరహాలోనే ఈ సినిమా నిర్మించాం. సినిమా నిర్మాణంలో అన్ని అంశాలనూ అవగాహన చేసుకున్నాం. దీనిని మొదలుపెట్టడానికి ముందు మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీకర్ రెడ్డి, నేను కలిసి దాదాపు 15 నుంచి 20 మంది నిర్మాతలు, పరిశ్రమ ప్రముఖులను కలిసి వారి అనుభవాలు తెలుసుకున్నాం. అసలు చాలా సినిమాలు ఎక్కడ నిలిచిపోతాయో, అవి సినిమా థియేటర్ల వరకు రాకపోవడానికి కారణాలు ఏమిటనే విషయాలను అవగాహన చేసుకున్నాం. దీంతో సినిమా నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మాకు స్పష్టత వచ్చింది. అనంతరం మా సినిమా షూటింగ్ 40 రోజుల్లోనే పూర్తయింది. కానీ కరోనా కారణంగా మా సినిమా విడుదల కావడానికి రెండేళ్లు పట్టింది’ అని జాన్సన్ వివరించారు.
ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా థియేటర్లలో సినిమా విడుదల చేయాలనే భావించినట్టు జాన్సన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఓటీటీల నుంచి అవకాశాలు వచ్చినా వదులుకున్నట్టు చెప్పారు. ఇది కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని తాము భావించామని, అందుకే రెండేళ్లపాటు వేచి చూసి ఇప్పుడు విడులు చేసినట్టు తెలిపారు. ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. కానీ రెగ్యులర్ స్టోరీల జోలికి వెళ్లనని.. ఏదైనా కొత్తగా ఉండే కాన్సెప్ట్ కే మొగ్గు చూపుతానని స్పష్టంచేశారు. ప్రస్తుతం అలాంటి కథలు వింటున్నానని, వాటిలో ఒకటి దాదాపు ఖరారైందని తెలిపారు. కరోనా మూడో వేవ్ పై స్పష్టత వచ్చిన తర్వాత షూటింగ్ మొదలుపెడతామని.. ఈ సారి కమర్షియల్ హీరోలతోనే సినిమా చేస్తానని వెల్లడించారు. మరోవైపు ఓటీటీల కోసం కూడా కొన్ని కథలు వింటున్నట్టు చెప్పారు. సినిమా నిర్మాణ దశలో ఉండగా దర్శకుడి వైఖరిలో మార్పు వచ్చినా.. ఇష్టమొచ్చినట్టు బడ్జెట్ పెంచేస్తున్నా.. వెంటనే ఆ ప్రాజెక్టు నుంచి అతడిని తప్పించడమే కరెక్ట్ అని జాన్సన్ అభిప్రాయపడ్డారు. నిర్మాతలు హడావిడిగా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం మంచిది కాదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here