వంగవీటి దారెటు?

WHAT IS VANGAVEETI NEXT STEP?

వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తదుపరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? జగన్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. తెలుగుదేశానికి జై కొడతారా లేక జనసేన వైపు చూస్తారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. టీడీపీ వైపు రాధా వెళుతున్నారనే సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. తన తండ్రిని టీడీపీ నేతలే చంపించారంటూ ఒకప్పుడు ఆరోపణలు చేసిన వంగవీటి.. తాజాగా మాట మార్చారు. తన తండ్రి వంగవీటి రంగా హత్యను టీడీపీకి ఆపాదించడం సరికాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ విషయంపై ఆవేశంతో మాట్లాడి, అభిమానులను రెచ్చగొట్టానని.. కానీ అది కేవలం కొంతమంది వ్యక్తులు చేసిన హత్య అని పేర్కొన్నారు. ఇక వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పై విపరీతంగా విరుచుకుపడ్డారు.

వైఎస్సార్ సీపీలో తానే సర్వస్వం, తాను చెప్పిందే వేదం, ఎవరైనా నా కిందోడే అనేలా జగన్‌ తీరు ఉంటోందని ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, వాటన్నింటినీ భరించినా ఇంకా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తూ, అల్లరి పెట్టాలని చూడడం వల్లే బయటకు వచ్చానని పేర్కొన్నారు. తనను చంపుతామంటూ బెదిరింపులకు సైతం దిగారన్నారు. తన తండ్రిపై అభిమానంతో కొందరు విగ్రహం పెడుతుంటే.. ఆ కార్యక్రమానికి తాను వెళ్లడం తప్పని, ఎవరికి చెప్పి వెళ్లావంటూ తనను జగన్‌ నిలదీయడంతోపాటు అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ తన పద్ధతులను మార్చుకుని రంగా అభిమానులను గౌరవిస్తే మంచిదని రాధా సూచించారు. రంగాను చంపిన పార్టీలోకి ఎలా వెళ్తావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే కొందరు వ్యక్తులు చేసిన పనిని.. తెదేపాకు ఆపాదించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో తనను పార్టీలోకి ఆహ్వానించారని రాధా వెల్లడించారు. అయితే, తాను తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నానో లేదో మాత్రం ఆయన స్పష్టంచేయలేదు.

ప్రస్తుతం రాధా ముందు రెండే మార్గాలు ఉన్నాయంటున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడమా లేక జనసేన తీర్థం పుచ్చుకోవడమా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపితే, ఆయన సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత వెల్లువెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా చేయడం కంటే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరితే బెటర్ అనే సలహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article