What KCR Decission On New Airports?
మార్చి 6న తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానుండగా మార్చి 8న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ లో ఆదిలాబాద్, కొత్తగూడెంలలో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్, కొత్తగూడెంలలో విమానాశ్రయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలకు విమానాశ్రయాలను తీసుకురావాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో దీని సాధ్యసాధ్యాలపై వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి అయి ఉంటే ఈ సమావేశాల్లోనే ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం విమానాశ్రయంకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగాన్ని నివేదిక కోరినట్లు తెలుస్తోంది.ఆదిలాబాద్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధీనంలో నడిచే ఎయిర్ఫోర్స్ స్టేషన్ కోసం భూసేకరణ జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితమే 1600ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. దీనిపై పూర్తి వివరాలను కోరింది ముఖ్యమంత్రి కార్యాలయం. అంతేకాదు 369 ఎకరాల్లో ఉన్న పాత ఏరోడ్రోమ్ను కూడా పూర్తి స్థాయి ఎయిర్ఫోర్స్ స్టేషన్గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే విమానాశ్రయ ఏర్పాటుపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఎయిర్ఫోర్స్ స్టేషన్ ప్రతిపాదనకు భూసేకరణ జరిపేలా ప్రభుత్వం ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది .