ఆరేళ్లయ్యింది.. అంబేద్కర్ విగ్రహం ఎక్కడ?

ప్రగతి భవన్ ని ఎంత వేగంగా కట్టించారు.. సచివాలయ నిర్మాణం జోరుగా జరిపిస్తున్నారు.. ఇలాంటి జోరే అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో కనిపించడం లేదెందుకు? ఈ విగ్రహం కట్టకపోతే ప్రజలు అధికార పార్టీకి ఓట్లు వేయనని చెప్పారా? అలాంటిదేం లేదు కదా.. మరి, విగ్రహం కడతానని చెప్పడమెందుకు? ఆ తర్వాత పట్టించుకోకపోవడం ఎందుకు?

142

దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి 2015లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేసింది. అప్పట్లో పెద్దగా హడావిడి చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెడుతుంటే.. తామేం తక్కువ కాదంటూ.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి తీరుతామంటూ తీర్మానించారు. సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. చివరికీ, ఇది కూడా జర్నలిస్టులకు ఇళ్ల సంగతిలాగే తయారైంది. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు.

అంబేద్కర్ విగ్రహం గురించి అధికార పక్షానికి మళ్లీ 2020లో గుర్తొచ్చింది. హడావిడిగా ఒక పార్లమెంట్ బొమ్మ గీయించి.. దానిపై అంబేద్కర్ బొమ్మను నిలబెట్టి.. ఇదిగో ఇదే నెక్లస్ రోడ్డులో ఏర్పాటు చేసే అంబేద్కర్ విగ్రహం అని కేటీఆర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ వంటి మంత్రులు ప్రకటించారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు. అసలు ప్రభుత్వం విగ్రహం పెడతామని చెప్పడమెందుకు? విగ్రహం పెట్టకపోతే ఎవరైనా ఓట్లు వేయమన్నారా? అలా లేదే? ప్రగతి భవన్ ను ఎంత వేగంగా కట్టించారు.. సచివాలయంను హడావిడిగా ఎలా కట్టేస్తున్నారు? మరి, అంత స్పీడు అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో కనిపించడం లేదంటూ సదరు స్వేరోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • సందిట్లో సడేమియా లాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అంబేద్కర్ విగ్రహం కోసం నిరహార దీక్ష అంటూ హడావిడి చేశారు. రాష్ట్రంలో ఒకవైపు కరోనాతో తల్లడిల్లుతుంటే.. ప్రభుత్వం అనేక రంగాల్లో వైఫల్యం చెందుతుంటే.. వాటి గురించి పోరాటం చేయడం మానేసి అంబేద్కర్ విగ్రహం కోసం దీక్ష చేయడమేమిటి? ప్రజల ఆలోచనా విధానం మారింది. చాలా తెలివిగా తమ నిర్ణయం చెబుతున్నారు. పాత రాజకీయాలు చేస్తామంటే ప్రస్తుతం ఎవరూ పట్టించుకోరు. కంప్యూటర్లు వచ్చిన కాలం నాటి 4 జీబీ రాజకీయాలే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను మీరే బొంద పెట్టినట్లు అవుతుంది. ఈ విషయంలో ఇప్పటికే అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది. అందుకే, కాస్త ప్రజలకు ఉపయోగపడే వాటి మీద పోరాటం చేయాలని తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ నాయకుల్ని కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here