ఏపీలో బీసీలు ఎవరికి ఓటేస్తారో?

WHICH PARTY WIN BC VOTES

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయనున్నారు. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనుండగా.. తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఒక విడతలో.. పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని ఏకపక్ష విజయం సాధించిన వైఎస్సార్ సీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే ప్రభావం చూపుతుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన బీసీలు.. ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో వారు వైసీపీ వైపు మొగ్గు చూపించడంతో జగన్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీంతో బీసీలను మరింత దగ్గర చేసుకునే దిశగా ఆయన చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే, దీనిపై టీడీపీ నేతలు కేసు వేయడంతో హైకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కొత్త జాబితాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో సర్కారు ఆ మేరకే ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. బీసీలు దాదాపు 9 శాతం సీట్లు కోల్పోవడానికి టీడీపీయే కారణమని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుండగా.. హైకోర్టులో డొల్ల వాదనతో వ్యతిరేక తీర్పు వచ్చేలా అధికార పార్టీ వ్యవహరించిందని టీడీపీ విమర్శలు సంధిస్తోంది. మొత్తానికి తప్పు మీదంటే మీదంటూ రెండు పార్టీల నేతలూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీసీలు ఎవరి పక్షాన మొగ్గు చూపుతారో అనే ఆందోళన అందరిలో నెలకొంది. వారు ఎవరివైపు ఉంటే విజయం వారినే వరించే అవకాశం ఉండటంలో పార్టీలు బీసీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article