who’s coming to dinner with Donald Trump
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన గుర్తింపు పొందారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన నివాసంలో ఇవ్వనున్న విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. కేవలం వంద మంది మాత్రమే హాజరు కానున్న రాష్ట్రపతి విందుకు కేవలం ఎనిమిది మంది ముఖ్యమంత్రులను మాత్రమే ఆహ్వానిస్తుండగా.. అందులో కేసీఆర్ ఒకరు కావడం విశేషం.
ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న డొనాల్డ్ ట్రంప్… మొదటి రోజంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా భావిస్తున్న అహ్మాదాబాద్ స్టేడియంను ట్రంప్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళ నుంచి ట్రంప్.. మర్నాడు ప్రపంచ వింతలలో ఒకటిగా భావించే ఆగ్రా తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. ఫిబ్రవరి 24 రాత్రి గానీ, 25 మధ్యాహ్నం గానీ రాష్ట్రపతి కోవింద్ అమెరికా అధ్యక్షుని గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేయనున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌కు ఇస్తున్న విందుకు హాజరై ఆతిథ్యం స్వీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి ఇన్విటేషన్ అందినట్లు సీఎంఓ ధృవీకరించింది. ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు కేవలం వంద మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకే రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. వీరితో పాటు దేశంలో అస్సాం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణా కలిపి మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం పంపారు.
మోదీ ప్రభుత్వంతో రాజకీయంగా చాలా అంశాల్లో విభేదిస్తున్న కేసీఆర్, నవీన్ పట్నాయక్, ఉద్ధవ్ థాక్రే వంటి సీఎంలకు ఆహ్వానం రావడం విశేషం. ఇటీవల కాలంలో బీజేపీకి చాలా దగ్గరైనట్లు కనిపిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం రాకపోవడంపై రాజకీయపరంగా చర్చ మొదలైంది.