Why Buyers Not Coming Forward?
ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దందా చేస్తుందా? మద్యం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదే ప్రభుత్వం ఆధారపడిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. గత నాలుగేళ్ల నుంచి క్షుణ్నంగా గమనిస్తే.. నగరానికి నాలుగు వైపులా కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటనల వర్షం కురిపించడం, అక్కడికెళ్లి శంకుస్థాపనలు, శిలాఫలకం వంటివి వేయడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. అక్కడేదో అద్భుతం జరుగుతుందని, అప్పుడు కొనకపోతే ఏదో ఘోరం జరిగిపోతుందనే రీతిలో పలు రియల్ సంస్థలు, ఏజెంట్లు గోబెల్స్ ప్రచారం నిర్వహించారు. ఫలితంగా, ఒక్కసారిగా భూములు ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రెండేళ్ల దాకా హైదరాబాద్లో ఫ్లాట్ల ధరలు పెద్దగా పెరిగింది లేదు. టీఎస్ ఐపాస్ ప్రకటించిన తర్వాతే కొంత కదలికలు ఏర్పడ్డాయి. రియల్ సంస్థల్ని ఆకట్టుకోవడానికి రకరకాల ప్రాజెక్టుల్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, ఎక్కడికక్కడ భూముల ధరలు పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ఉదాహరణకు, బుద్వేల్ లో కొత్తగా ఐటీ పార్కు ప్రారంభిస్తామని ప్రకటించడంతో అక్కడ అమాంతంగా భూముల విలువలు పెరిగాయి. అప్పటివరకూ చదరపు అడుక్కీ రూ.3000 కి అటుఇటుగా ఉన్న ఫ్లాట్ల ధరలు ఒక్కసారిగా చదరపు అడుక్కీ రూ.5,000లకు చేరుకున్నాయి. మరి, ఆ ప్రకటన వచ్చినప్పట్నుంచి అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా? అంటే అదీ లేదు. ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొచ్చాయా? అంటే లేనే లేదు. రూ. 30 లక్షలకు దొరికే డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర ఒక్కసారిగా రూ.50 లక్షలు అయితే సామాన్యులు ఎలా కొనుగోలు చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేటు ఉద్యోగి అయినా.. అంత హఠాత్తుగా జీతం పెరుగుతుందా? అందుకే, బుద్వేల్, బండ్లగూడ, కిస్మత్ పూర్ వంటి ప్రాంతాల్లో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు కొనుక్కోలేకపోతున్నారు. అప్పటివరకూ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ఫ్లాట్ల ధరలు ఒక్కసారిగా ఉన్నత మధ్యతరగతి ప్రజలు కొనే స్థాయికి పెరిగిపోయాయి. అందుకే, పలు నిర్మాణ సంస్థలు బండ్లగూడ, కిస్మత్పూర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఇటీవల కాలంలో డిస్కౌంట్లనూ ప్రకటించారు.
* మొన్నటికి మొన్న సుల్తాన్పూర్లో ప్లాస్టిక్ పార్కు అని పటాన్ చెరు సమీపంలో హడావిడి చేశారు. ఇంకేముంది ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సంస్థలన్నీ అక్కడికి వచ్చేస్తున్నాయంటూ ఊదరగొట్టారు. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు అమాంతం అక్కడ స్థలాల ధరల్ని పెంచేశారు. అప్పటివరకూ చదరపు గజానికి రూ.3 నుంచి 5 వేలు ఉండేది. అలాంటిది, ఆతర్వాత గజానికి రూ.10 నుంచి రూ.15 వేలు చెబుతున్నారు. మరి, సామాన్యులు అంతంత రేటు పెట్టి కొనగలరా? అంటే అదీ లేదు. పోనీ ధరలు పెరిగిన తర్వాత అక్కడ జనాలు ప్లాట్లు కొంటున్నారా? అంటే అదీ లేదు. సామాన్యులకు అందుబాటులో రేటు ఉంటేనే ప్లాట్లు అయినా ఫ్లాట్లు అయినా కొంటారు. వారి తాహతు మించిన ధర ఉంటే పెద్దగా పట్టించుకోరు. వచ్చే పదేళ్లలో పెరగాల్సిన ధరల్ని ఇప్పటికే పలు రియల్ సంస్థలు పెంచేశాయి. సామాన్యులు స్థలాల్ని కొనాలంటే, ఇక ఔటర్ రింగ్ రోడ్డు దాటి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు వద్ద కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటిస్తే.. ఇక అక్కడ కూడా భూముల ధరలు పెరిగిపోయే ప్రమాదముంది. కాబట్టి, ప్రభుత్వం సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.