ఔనా.. ఇది నిజమేనా?
ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పట్నుంచి.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఓ రసవత్తరమైన చర్చ జరుగుతోంది. మైహోమ్ రామేశ్వరరావును దెబ్బతీసేందుకే సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయాలన్న కంకణం కట్టుకున్నారని కొందరు రియల్టర్లు అనుకుంటున్నారు. మైహోమ్ రామేశ్వరరావు బీజేపీతో కలిసిపోవడం.. ఆయనకు రాజ్యసభ సీటునూ కేటాయిస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడం.. సమతామూర్తీ విగ్రహ ఆవిష్కరణ సమయంలో సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం.. స్వయంగా పీఎంని ఆహ్వానించడానికి వెళ్లకపోవడం వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. ముచ్చింతల్‌లో మై హోమ్ రామేశ్వర్రావు సుమారు ఐదు వేల ఎకరాల దాకా సేకరించారు. వాటిలో ఓ బడా శాటిలైట్ టౌన్‌షిప్పును చేపట్టాలన్నది ఆయన లక్ష్యమని.. అందుకే కొన్నేళ్ల నుంచి అక్కడి భూముల్ని సేకరిస్తూ వచ్చారని అంటున్నారు. అందులోనే సమతామూర్తి విగ్రహంతో పాటు ఒక ఫౌండేషన్‌కు కొంత స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే.
ఇక అసలు విషయానికొస్తే.. మైహోమ్ ఆరంభించ తలపెట్టిన శాటిలైట్ టౌన్‌షిప్పు చేరువలోనే శంషాబాద్ మండలం పరిధిలోని కొన్ని గ్రామాలు ట్రిపుల్ వన్ జీవో కిందికొస్తాయి. ఈ జీవోను ఎత్తివేస్తే.. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూములు అభివృద్ధిలోకి వస్తాయి. వేలాది ఎకరాలు అందుబాటులోకి వచ్చి సరఫరా పెరిగితే.. గిరాకీ తగ్గుముఖం పడుతుంది. భూముల ధరలూ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మైహోమ్ సంస్థ శాటిలైట్ టౌన్‌షిప్పును ఆరంభించినా పెద్దగా గిరాకీ ఉండదని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మై హోమ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ తీయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని.. అందుకే, సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేయాలన్న పట్టుదలతో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఇలాంటి వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. కొంతకాలం వేచి చూస్తేనే తెలుస్తుంది.
More Property Updates Stay Tuned