Why Junior Ntr Not Supporting TDP
టిడిపి అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక 2009 టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు టిడిపికి దూరంగా ఉన్నారని చంద్రబాబును నిలదీశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. నేడు చంద్రబాబు ఇసుక దీక్ష సందర్భంగా చేస్తున్న పోరాటం ఉద్దేశించి మాట్లాడిన వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురించి ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుంటే ప్రశ్నించని మీరు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రశ్నించని మీరు ఏపీలో మాత్రం ఎందుకు డైలాగ్లు కొడుతున్నారని వల్లభనేని వంశీ అన్నారు. అక్కడో న్యాయం, ఇక్కడో న్యాయమా అంటూ నిలదీశారు.
అంతేకాదు ఇలా చేస్తే దాన్ని సంసారం అంటారా అని చంద్రబాబును వంశీ సూటిగా ప్రశ్నించారు. మంచి చెడు లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు చేస్తుంటే మీ వెనక దూడల్లా తాము వస్తే భవిష్యత్ ఏమవుతుందని ప్రశ్నించారు వంశీ. ఇక మంచిని మంచిగా, చెడును చెడుగా చూసే రాజకీయ సంస్కారం కావాలని హితవు పలికారు. మంచిని కూడా చెడు అని ప్రచారం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో జనం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఇక ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీష్ మీడియం లో పిల్లల్ని చదివిస్తా మంటే మనం వ్యతిరేకించటం న్యాయమా భావ్యమా అని ప్రశ్నించారు వంశీ. అంతేకాదు మాకు తెలుగు మీడియం కావాలని పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ చెబుతున్నారా అని అడిగారు. రాజకీయ నాయకులు మాత్రమే మీరు చెబుతున్నారు అన్న వంశీ మీ పిల్లలకు ఒక న్యాయం పేదలకు ఇంకొక న్యాయమా అంటూ నిలదీశారు.
ఎన్నికల ముందు పొత్తు, ఎన్నికల తరువాత రాజకీయాల కోసం మరో మాట మాట్లాడటం వల్ల తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చాలా పలుచగా అయిందని పేర్కొన్న వంశీ టీడీపీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది అని వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి మూడేళ్లు బాగానే ఉండి తర్వాత ధర్మపోరాట దీక్షలు చేయడం దేనికి అంటూ ప్రశ్నించిన వంశీ నాకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తర్వాత, ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా టిడిపికి ఎందుకు లేదు అంటూ చంద్రబాబును నిలదీశారు.