ఎస్సై కాబోయి.. ముద్దాయి అయింది

WIFE KILLED HUSBAND

  • ప్రియుడిపై మోజుతో భర్తను చంపిన ఇల్లాలు
  • హైదరాబాద్ లో దారుణం

ఎస్సై కావాల్సిన మహిళ ముద్దాయి అయింది. తనను చదివించి, కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తనే దారుణంగా హతమార్చింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడినే కర్కశంగా కాటికి పంపింది. తమ అనైతిక బంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. హత్య జరిగిన రెండు రోజుల్లోనే పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు.

రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ 2009లో వరంగల్‌ జిల్లా నెక్కొండకు చెందిన సంగీతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా బోరబండ రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. పదో తరగతి మాత్రమే చదువుకున్న శ్రీనివాస్‌.. తన భార్యను చదివిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని భావించాడు. దీంతో ఆమెను ఇంటర్, డిగ్రీ చదివించాడు. ప్రస్తుతం సంగీత బీఈడీ చదువుతోంది. ఎస్సై ప్రాథమిక పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించింది. ఇలాంటి తరుణంలో చక్కని భవిష్యత్తు ముందున్న ఆమె మనసు దారి తప్పింది. శ్రీనివాస్ మేనల్లుడు విజయ్ తో ఏర్పడిన పరిచయం అనైతిక బంధానికి దారి తీసి, చివరకు భర్తను హత్య చేసే పరిస్థితికి దిగజారింది. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌కు చెందిన విజయ్‌ ఐటీఐ పూర్తిచేసి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు. ఇతడు కొన్నాళ్లు శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరి మధ్య అనైతిక బంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన శ్రీనివాస్‌ ఇద్దరినీ మందలించి విజయ్‌ను ఇంటి నుంచి బయటకు పంపేశాడు. అయినప్పటికీ వారిద్దరూ మారలేదు.

శ్రీనివాస్‌ లేని సమయంలో విజయ్ బోరబండ వచ్చి సంగీతను కలుస్తున్నాడు. ఈ విషయం మళ్లీ శ్రీనివాస్ కు తెలియడంతో అతడు భార్యను హెచ్చరించాడు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికాడు. దీంతో తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, అతడిని తొలగించుకుంటే తాము హాయిగా ఉండొచ్చని సంగీత భావించింది. అలాగే భర్త చనిపోతే, అతడి ఉద్యోగం విజయ్ కు వస్తుందని, దాంతో తమకు ఎలాంటి సమస్యా ఉండదని ఆలోచించింది. వెంటనే విజయ్ తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. నిద్రపోతున్న శ్రీనివాస్ తలపై బండరాయితో మోది చంపాలని ఇరువరూ నిర్ణయించుకున్నారు. అరుపులు వినపడకుండా రైలు వచ్చే సమయంలో పని పూర్తిచేశారు. తర్వాత అతడి మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేశారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు సంగీత ప్రవర్తనపై అనుమానం కలిగింది. కాస్త లోతుగా విచారించేసరికి అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

CRIME NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article