WIFE LEAVES HUBBY FOR DOGS
- శునకాల కోసం కట్టుకున్నోడిని వదిలేసిన ఇల్లాలు
ఆమె ప్రేమించినవాడితో జీవించడం కోసం కన్న తల్లిదండ్రులను వదిలేసింది. తర్వాత కుక్కలను పెంచుకోవడం కోసం కట్టుకున్నోడికి గుడ్ బై చెప్పేసింది. నేను కావాలా.. కుక్కలు కావాలా తేల్చుకో అని ఆల్టిమేటం జారీచేసిన భర్తకు షాక్ ఇచ్చింది. నువ్వే పో.. నేను కుక్కలతోనే జీవిస్తా అని తెగేసి చెప్పింది. ఇంగ్లాండ్‌లోని బ్రన్హమ్‌కు చెందిన లిజ్‌కు చిన్నప్పటి నుంచి శునకాలంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయం వాటితోనే ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చాక మైక్ హస్లమ్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. అయితే, తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 1991లో అతడిని వివాహం చేసుకుంది. వీరికి 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఏడేళ్ల కిందట కుక్క పిల్లల వ్యాపారం మొదలుపెట్టింది. మొదట్లో ఒకటి రెండు కుక్కలు ఉన్నా.. మైక్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అవి పెరిగాయి. రకరకాల జాతుల కుక్కలను తీసుకురావడం మొదలుపెట్టింది. అలా 30 కుక్కలు వచ్చాయి. రోజంతా వాటితోనే గడిపేది. దీంతో భర్త మైక్ విసుగెత్తిపోయాడు. ఓ ఫైన్ మార్నింగ్.. ‘‘ఆ కుక్కలు కావాలో, నేను కావాలో తేల్చుకో’’ అంటూ లిజ్‌పై మండిపడ్డాడు. దీంతో ఆమె ‘‘నాకు కుక్కలే కావాలి.. నువ్వే పో’’ అని తెగేసి చెప్పడంతో మైక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయినా లిజ్ మాత్రం ఏమీ ఫీల్ కావడంలేదు. తనకు భర్త కంటే శునకాలే ఎక్కువని స్పష్టంచేసింది.